Loading...

Explore Projects Across the Rajahmundry

శాంతించినది

శాంతించినది

 ధవళేశ్వరం వద్ద 11 అడుగులకు చేరిన నీటిమట్టం

తగ్గుముఖం పట్టిన గోదావరి ఉద్ధృతి

లంకల్లో ఇంకా వీడని ముంపు కష్టాలు

ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు


రాజమహేంద్రవరంలోని గోదావరి వరద ఉరవడి

రాజమహేంద్రవరం : ఉగ్రరూపం దాల్చిన గోదావరి తగ్గుముఖం పట్టింది. ఎగువన కురిసిన వర్షాలకు నది పోటెత్తడంతో పలు ప్రాంతాలు ముంపు బారినపడ్డాయి. దాదాపు 14 రోజుల పాటు ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్తు లేక అంధకారంలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆదివారం నాటికి గోదావరిలో ప్రవాహం క్రమంగా తగ్గడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఇంకా వరద కష్టాలు పూర్తిగా తొలగిపోలేదు. కాజ్‌వేలపై ప్రవాహం తగ్గడంతో ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. లంకల్లో ఇళ్ల చుట్టూ చేరిన నీరు కిందకు దిగలేదు. దీంతో పలు లంక గ్రామాలకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించలేదు. దేవీపట్నం మండలంలో కూడా వరద తగ్గుముఖం పట్టినా నీరు గ్రామాల నుంచి పూర్తిగా బయటకు వెళ్లలేదు. ఆదివారం కూడా పునరావాస కేంద్రాలను కొనసాగించారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద గోదావరి 11 అడుగుల నీటిమట్టం ఉండగా 9.10లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం నాటికి ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం నుంచి మళ్లీ అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన మేరకు రైతులు, లంక వాసులు ఆందోళన చెందుతున్నారు. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేవద్ద గల్లంతైన షేక్‌సమీర్‌ బాషా(23), షేక్‌ రెహమన్‌(17) మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి.

చీకట్లోనే లంక గ్రామాలు…

వరదల కారణంగా లంక గ్రామాల్లో విద్యుత్తును నిలుపుదల చేశారు. పూర్తిస్థాయిలో వరద తగ్గకపోవడం వల్ల ఇంకా సరఫరాను పునరుద్ధరించలేదు. మరోవైపు ఇక్కడ తాగునీటికి సైతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సిబ్బంది శనివారం కొన్ని గ్రామాల్లో తాగునీరు అందించినా, ఆదివారం సహాయ చర్యలు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. కాజ్‌వేలపై వరద తగ్గుముఖం పట్టడంతో పడవలపై వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ముమ్మిడివరం మండలంలోని గురజాపులంక, లంకా ఆఫ్‌ ఠాణేలంకల వాసులు ఆదివారం సాయంత్రానికి కూడా ముంపులోనే ఉన్నారు. దేవీపట్నం మండలం, కోనసీమలోని లంక గ్రామాల్లో పునరావాస కేంద్రాలను కొనసాగిస్తున్నట్లు రంపచోడవరం పీవో నిషాంత్‌కుమార్‌, అమలాపురం ఆర్డీవో వెంకటరమణ తెలిపారు.

పారిశుద్ధ్య చర్యలకు సిద్ధం

వరద ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా పంచాయతీ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. వైద్యఆరోగ్య శాఖ నుంచి వైద్య శిబిరాల ఏర్పాటు, యాంటీలార్వా వంటి మందులను పిచికారీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు డీఎంహెచ్‌వో సుశీల తెలిపారు. పంచాయతీరాజ్‌ విభాగం నుంచి వరద తగ్గిన ప్రాంతాల్లో బ్లీచింగ్‌ చల్లడం, చెత్తను తొలగించడం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌వీ నాగేశ్వర నాయక్‌ తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా ముందుస్తు జాత్రగ్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.

కొనసాగుతున్న సేవలు

వరదల నేపథ్యంలో జిల్లాలో నియమించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎప్‌ బృందాల సేవలు కొనసాగుతున్నాయి. దేవీపట్నం, అమలాపురం కేంద్రంగా చేసుకుని సేవలు అందిస్తున్నారు. 90 మంది ఎస్‌డీఆర్‌ఎప్‌, 111 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సేవలు అందిస్తున్నాయి. మరోవైపు పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. వరద సమయంలో ఇచ్చే సామగ్రి కాకుండా ప్రతినెలా ఇచ్చే రేషన్‌ సరుకులను వరద బాధితులందరికీ అందజేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన 19 ఇంజిన్‌ బోట్లు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు.

ప్రమాద హెచ్చరికల ఉప సంహరణ ఇలా..

రాజమహేంద్రవరం నగరం : ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద ఈ నెల 3న తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పట్నుంచి ఆదివారం వరకు గోదావరి ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక అంటే శనివారం వేకువజామున 2 గంటలకు ఈ సీజన్‌లోనే 15.60 అడుగుల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అదే ప్రవాహం సుమారు 11 గంటలపాటు నిలకడగా ఉండిపోయింది. అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు 15.50 అడుగులకు చేరింది. అక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ ఆదివారం ఉదయం 5.30 గంటలకు 13.70 అడుగులకు వరద ప్రవాహం చేరటంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉప సంహరించారు. మధ్యాహ్నం మూడు గంటలకు 11.70 అడుగులకు చేరటంతో మొదటి ప్రమాద హెచ్చరికనూ వెనుక్కు తీసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు 11.00 అడుగులకు వరద ప్రవాహం చేరుకుంది. ఈ సీజన్‌లో జూన్‌ 1 నుంచి ఆదివారం వరకు మొత్తం 1,262.67 టీఎంసీల వరద నీరు బ్యారేజీ వద్దకు చేరిందని అధికారులు తెలిపారు.

 

అమ్మో అగస్ట్

పి.గన్నవరం : ఆగస్టు వచ్చిందంటే జిల్లాలో గోదావరి తీర ప్రాంత వాసులు హడలెత్తిపోతారు. ఎందుకంటే గోదావరి చరిత్రను తీసుకుంటే ఏటా ఈ నెలలోనే ఎక్కువగా వరదలు వచ్చాయి. 1953 నుంచి గతేడాది వరకు మొత్తం 34 సార్లు వరదలొస్తే దాంట్లో 21 సార్లు ఆగస్టులో రావడం గమనార్హం. ఇప్పుడొచ్చిన వరదను కలుపుకొంటే ఈసంఖ్య 22కి చేరుతుంది.

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఆగస్టులో 20 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీటిని సముద్రంలోకి వదిలిపెట్టిన సంవత్సరాలు ఇలా ఉన్నాయి. (వివరాలు క్యూసెక్కుల్లో)

అయినవిల్లి మండలం వెదురుబీడెం కాజ్‌వేపై వరదనీరు ప్రవహిస్తుండడంతో పడవల్లో రాకపోకలు

మామిడికుదురు మండలం ఉచ్చులవారిపేట కాజ్‌వే వద్ద నీటిలో నడిచి వస్తున్న స్థానికులు

ఈ నెల 3న గోదావరి వరదకు గండిపోశమ్మ ఆలయంలో ముంపు నీటిలో అమ్మవారి విగ్రహం

ఆదివారం వరద తగ్గుముఖం పట్టడంతో ఇలా..