Loading...

Explore Projects Across the Rajahmundry

village

గ్రామ వాలంటీరు వేధింపులు..

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

వీరవేణి మృతదేహం

కాట్రేనికోన, న్యూస్‌టుడే: గ్రామ వాలంటీరుతో ఏర్పడిన వివాదం కారణంగా ఓ వివాహిత మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాట్రేనికోన మండలం పల్లం పంచాయతీకి చెందిన మల్లాడి ఆదినారాయణ, వీరవేణి(28) దంపతులు చేపల వేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన కోరిక తీర్చేవిధంగా గ్రామానికి చెందిన ఒక మహిళను ఒప్పించాలని స్థానిక గ్రామ వాలంటీరు పాలెపు మాధవవర్మ కొన్ని రోజుల కిందట వీరవేణిని కోరాడు. ఇందుకు వీరవేణి నిరాకరించడంతో వారిద్దరి మధ్య వివాదం జరిగింది. దీనిపై గ్రామపెద్దల ఆధ్వర్యంలో ఆదివారం పంచాయతీ పెట్టారు.

ఈ సందర్భంగా కోపోద్రిక్తురాలైన వీరవేణి పెద్దల మధ్యలోనే కుర్చితో మాధవ వర్మను కొట్టింది. గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం అమలాపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మాధవవర్మ బంధువులు వీరవేణితో గొడవకు దిగి దూషించారు. దీంతో మనస్తాపానికి గురైన వీరవేణి ఆదివారం రాత్రి పల్లంలోని సముద్రపు పర్రపాయ వంతెన పైనుంచి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

సోమవారం సాయంత్రం ఆమె మృతదేహం నదీపాయలో లభ్యమైంది. సీఐ రాజశేఖర్‌, ఎస్సై సంపత్‌కుమార్‌ మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించిన బాధిత మహిళ కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. మాధవ వర్మ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరవేణి మృతికి కారకులైన మాధవ వర్మ సహా మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంపత్‌కుమార్‌ తెలిపారు. వీరవేణికి కుమారుడు నరేంద్ర, కుమార్తె హారిక ఉన్నారు. నరేంద్ర రెండో తరగతి చదువుతున్నాడు. కుమార్తె అంగన్‌వాడీ కేంద్రానికి వెళుతోంది. తల్లి మరణంతో పిల్లలిద్దరు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

విధుల నుంచి తొలగింపు

పల్లంలో వివాహిత మృతికి కారణమైన గ్రామ వాలంటీరు మాధవ వర్మను విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో కేసీహెచ్‌ అప్పారావు తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ వీరవేణి మృతి సంఘటనపై పంచాయతీ కార్యదర్శి రవిరాజ్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా గ్రామ వాలంటీరు మాధవవర్మను విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు.