Loading...

Explore Projects Across the Rajahmundry

నేడు తెలుగు భాషా దినోత్సవం

ఆశ.. శ్వాస.. ధ్యాస..తెలుగు భాష

 

‘దేశభాషలందు తెలుగు లెస్స’ -శ్రీకృష్ణదేవరాయులు..
‘దేశభాషల్లో తెలుగు మధురం’ -రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

నేడు తెలుగు భాషా దినోత్సవం

తెలుగు వాడు ఎంత ఎదిగినా.. ఖండాంతరాలు దాటినా.. ఎన్ని భాషల్లో మాట్లాడినా.. తమ ఆలోచనా దృక్పథం తేట తెలుగులోనే ఉంటుంది.

మనం ఆంగ్లంలో మాట్లాడాలన్నా ముందు దానిని తెలుగులో మననం చేసుకున్నాకే బయటకు ఆంగ్లంలో మాట్లాడతాం.. అదీ తెలుగు భాష గొప్పదనం. ఈ ఔన్నత్యాన్ని, మాధుర్యాన్ని కొందరు తెలుసుకోలేకపోతున్నారు.

అప్పట్లో భాషాభిమానుల పోరాటాలు, ఉద్యమాలతో తెలుగు ఓ వెలుగు వెలిగింది. మళ్లీ ఆ మహోన్నత ఉద్యమానికి మనమంతా అడుగేయాల్సిన తరుణమిది.

గురువారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనమిది. న్యూస్‌టుడే, నన్నయ విశ్వవిద్యాలయం
గ తంలో సుమారు ఒక తరానికి తెలుగు సాహిత్యం, పత్రాలు, గ్రంథాలు, పుస్తకాలు గ్రాంథిక భాషలో ప్రచురితమయ్యేవి.

వాటిని ప్రజలు మాట్లాడుకునే వాడుక భాషలోకి మార్చాలని వ్యవహారిక భాష ఉద్యమ కర్త గిడుగు రామ్మూర్తిపంతులు విశేషంగా కృషి చేశారు.

కొందరు వ్యతిరేకంచినా పట్టువిడవకుండా తెలుగు సాహిత్యం, పుస్తకాలు వ్యవహారిక భాషలోకి తీసుకొచ్చారు.

క్రమేణా ఆగస్టు 29న గిడుగు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. గిడుగు రామ్మూర్తిపంతులు తెలుగు భాషలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు.

ఆయన కుమారుడు గిడుగు సీతాపతి సైతం రాజమహేంద్రవరంలో నివాసం ఉండి తెలుగు సాహిత్యాన్ని బతికించేందుకు కృషి చేశారు.

వర్సిటీలో 21 సదస్సులు

మహాభారతంలోని రెండున్నర పర్వాలను తెలుగులోకి అనువదించిన ఆదికవి నన్నయ నడియాడిన నేలలో తెలుగు భాష, సాహిత్యం పరిరక్షణకు పలువురు విశేష కృషి చేస్తున్నారు.

జిల్లాలోని తెలుగు భాష అభివృద్ధికి పలు సంఘాలు, సంస్థలు పాటుపడుతున్నాయి. అందులో నన్నయ పేరుతో 2006లో ప్రారంభమైన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలోని తెలుగుశాఖ భాషా పరిరక్షణకు కృషి చేస్తోంది.

భాషాభివృద్ధికి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 21 జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించి విద్యార్థులు, అధ్యాపకులకు తెలుగు సాహిత్యాన్ని, గొప్పదనాన్ని వివరించారు.

అమెరికా, స్పెయిన్‌లలో భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారిని ఇక్కడికి ఆహ్వానించి మాతృభాషా పరిరక్షణకు ఏవిధంగా పని చేయాలనే దానిపై కార్యశాలలు నిర్వహించారు.

మొదటి సారిగా విశ్వవిద్యాలయంలో ద్రవిడ భాషపై సదస్సులు ఏర్పాటు చేశారు. కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ కవులు, రచయితలకు వివిధ పురస్కారాలు, జ్ఞాపికలు అందజేస్తున్నారు.

ఇక్కడి తెలుగు శాఖలో ఉన్న 17 మంది పరిశోధక విద్యార్థులు తెలుగులో ఆధునిక సాహిత్యంపై కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నారు. సాహిత్యంలో ఏటా రెండేసి సదస్సులు, కార్యశాలలు ఏర్పాటు చేస్తుంటారు.

వనితల అష్టావధానం

భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నన్నయ విశ్వవిద్యాలయంలోని తెలుగుశాఖ ఆధ్వర్యంలో వనిత అష్టావధానం  నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

ఎనిమిదిమంది కవయత్రులతో తెలుగు సాహిత్యంపై ప్రశ్న, సమాధానాలు, వాదోపవాదాలు, విజ్ఞాన విపులీకరణ జరుగుతుందని తెలుగుశాఖ విభాగాధిపతి తరపట్ల సత్యనారాయణ తెలిపారు.

శతావధాని శ్రీమతి బులుసు అపర్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు.

ఇదీ తెలుగు వెలుగు

దేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో 15వ స్థానంలో ఉంది.
మారిషస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 76 వేల వక్తలున్న ప్రముఖ మారిషస్‌ రేడియోలో ప్రతిరోజు గంటపాటు తెలుగు కార్యక్రమాలు నిర్వహించే ఘనత సాధించింది.

తెలుగులోని ప్రతి పదం అచ్చులతో పూర్తవుతుంది. దీని ద్వారా పదాలకు సంగీత భావం ఉంటుందని, చాలా విషయాలను సులభంగా చెప్పే శక్తి ఈ భాషలో ఉంటుందని పలువురు భాషా పండితులు అభిప్రాయం.
అతి కొన్ని భాషల్లో ఉండే అవధానం తెలుగులో ప్రసిద్ధి. 2008లో కన్నడతోపాటు తెలుగును క్లాసికల్‌ భాషగా ప్రభుత్వం గుర్తించింది. క్రీస్తు పూర్వమే కర్నూలు జిల్లాలో తెలుగు పదాలను గుర్తించినట్లు ఇటీవల పురావస్తు శాఖ అధికారులకు ఆధారాలు దొరికాయి.

తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి..

ఆంగ్ల భాషపై మోజు ఉన్నప్పటికీ మాతృ భాషను మరువకూడదు. నేటి యువత తెలుగు నేర్వకపోతే మాతృ భాషలో ఉన్న గొప్ప సాహిత్యం, విజ్ఞాన గ్రంథాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది.

తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలుగు నేర్పడం, మాతృభాషను గౌరవించడం తప్పనిసరిగా చేయాలి. ప్రభుత్వాలు సైతం ఉత్సవాలు చేయడం కన్నా భాషా పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

పుట్టినరోజులు, ఇతర వేడుకలకు స్నేహితులు, బంధువులకు ఓ తెలుగు పుస్తకాన్ని బహూకరిస్తే అందులో కొన్ని పదాలైనా నేటి యువతకు చేరుతాయి.
-డాక్టర్‌ తలారి వాసు, సహాయ ఆచార్య, తెలుగు శాఖ, నన్నయ విశ్వవిద్యాలయం

ప్రదర్శనశాల ఏర్పాటుకు కృషి

విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా పరిరక్షణకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

నన్నయ విశ్వవిద్యాలయంలో సాంస్కృతిక, వారసత్వ, భాషాభివృద్ధికి జాతీయ, అంతర్జాతీయ సదస్సులతోపాటు గతేడాది ఉగాదికి 140 మంది కవయత్రులతో తెలుగు సాహిత్యంపై సమ్మేళనం నిర్వహించాం.

తెలుగు గ్రంథాలు, సాహిత్యం, వారసత్వ సంపద పరిరక్షణకు గోదావరి సాంస్కృతి ప్రదర్శనశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.
-డాక్టర్‌ తరపట్ల సత్యనారాయణ, తెలుగుశాఖ విభాగాధిపతి, నన్నయ విశ్వవిద్యాలయం

ఆధునిక సాహిత్యంలో పరిశోధనలు

రెండేళ్ల నుంచి ఆధునిక సాహిత్యంలో పరిశోధనలు చేస్తున్నా. సాహిత్యం, కొత్త పదాలు తదితర అంశాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నా. పలు విభాగాల్లో పీహెచ్‌డీ చేస్తే పట్టా త్వరగా పొందే అవకాశం ఉంటుంది. తెలుగుపై ఉన్న గౌరవం, భాష గురించి తెలుసుకోవాలనే తపనతో జేఆర్‌ఎఫ్‌గా అవకాశం వస్తే వదులుకోలేదు.     -వెంకటరమణ, యూజీసీ పరిశోధక విద్యార్థి

పోటీ పరీక్షల్లో ప్రాధాన్యమివ్వాలి..

ప్రస్తుతం యువత తెలుగు భాషను మర్చిపోతున్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి నిర్వహించే పోటీ పరీక్షల్లో తెలుగుకు ప్రాధాన్యమిస్తే అంతా నేర్చుకునే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వ అధికారిక ప్రకటనలు సైతం తెలుగులోనే విడుదలైతే మరింతమంది నేర్చుకునేందుకు ముందుకొస్తారు.

కావ్య సాహిత్యంలో సంస్కరణలపై పరిశోధనలు చేస్తున్నా. భాషా పరిరక్షణకు నా వంతు కృషి చేస్తా.
-మామిడి మౌనిక, యూజీసీ పరిశోధక విద్యార్థిని


తపాలా స్టాంపులపై తెలుగు వెలుగులు
చిన్నారులకు మాతృభాష ఔన్నత్యాన్ని వివరిస్తున్న ఉపాధ్యాయిని

గాంధీనగర్‌ :  కేంద్ర ప్రభుత్వం కూడా తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు నిచ్చింది. దేశవ్యాప్తంగా అమ్మకాలు చేసే తపాలా స్టాంపులపై తెలుగు భాష, తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన కవులు, ప్రముఖుల చిత్రాలను ముద్రించింది. ఇటువంటి అరుదైన స్టాంపులను సేకరించి పిల్లలకు పాఠ్యాంశాలుగా భోధిస్తున్నారు కాకినాడకు చెందిన ఉపాధ్యాయిని కొరిపెల్ల పద్మావతి.భాషాభివృద్ధికి కృషి చేసిన కవులు, కళలు, సాహిత్యానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఆదికవి నన్నయ స్టాంపు నుంచి 1970వ దశకంలో విడుదలైన యోగి వేమన, కందుకూరి, గురజాడ, కవయిత్రి మొల్ల తదితర కవులతోపాటు, మొదటి తెలుగు మహాసభల సందర్భంగా విడుదలైన తెలుగుతల్లి స్టాంపు, కూచిపూడి నృత్యం, త్యాగయ్య, ఘంటసాల, ద్వారం వెంకట స్వామినాయుడు తదితర సంగీత విధ్వాంసుల స్టాంపులు సేకరించారు. తెలుగునేలపై చారిత్రక ప్రదేశాలైన గోల్కొండ కోట, చంద్రగిరి కోట, ద్రాక్షారామం, తిరుమల, శ్రీశైలం, అరసవల్లి తదితర ప్రసిద్ధ దేవాలయాల స్టాంపులను సేకరించారు. మాజీ ముఖ్యమంత్రులు టంగుటూరి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్‌టీఆర్, వైఎస్‌.రాజశేఖరరెడ్డి నాయకులను స్టాంపులపై ముద్రించారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన భానుమతి, సావిత్రి, ఎస్వీ రంగారావు, బీఎన్‌.రెడ్డి, ఎల్వీ.ప్రసాద్, అల్లు రామలింగయ్య తదితర ప్రముఖుల స్టాంపులను సేకరించి విద్యార్థులకు తెలియజేస్తున్నారామె.

ఆకట్టుకుంటున్న గిడుగు చిత్రం

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులుపై కాట్రేనికోనకు చెందిన చిత్రకారుడు ఆకొండి అంజి గీసిన చిత్రమిది. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది.
-న్యూస్‌టుడే, కాట్రేనికోన

తియ్యని తేట  తెలుగు
‘అ’న్నమయ్య పాడినట్టి అచ్చ తెలుగు పాట..
‘ఆ’దికవియే రాసినట్టి తేట తెలుగు మాట..
ఆధారామృత భాష…
‘ఇ’లకు వెలుగునిచ్చునట్టి దివ్యతేజ మీ భాష..
‘ఈ’-ప్సితాలు తీర్చునట్టి లెస్సయైనదీ భాష..
‘ఉ’దయించే సూర్యునిలా వెలుగునిచ్చును మన భాష..
‘ఊ’పిరై బతికించును ప్రతి తెలుగువాణ్ణి ఈ భాష..
‘రు’-ణం తీర్చుకోవాలి పలికి తియ్యందనాల తెలుగు భాష..
‘ఎ’న్నటికీ మరువరాదు తల్లిలాంటిదీ భాష..
‘ఏ’దేశమేగినా పొగడవలెను మన మాతృభాష..
‘ఐ’న వారందరికీ ఆత్మబంధువీ భాష..
‘ఒ’దుగుటయే.. ఎదుగుటయని నేర్పునీ భాష..
‘ఓ’ర్పుతోనే విజయమన్న స్థైర్యమిచ్చు మన భాష..
‘ఔ’దార్యమే నిండైన మనసునిచ్చునని తెల్పే మన భాష..
‘అం’దరూ చదవాలి ..ఎదగాలనే తపననిచ్చు తల్లి భాష…
‘ఆయ్‌.. అంటూ ఆత్మీయత పంచు మధుర భాష.. మన తెలుగు భాష..
-రచన: దేవరకొండ సుబ్బారావు, తెలుగు పండితుడు, రాయవరం