Loading...

Explore Projects Across the Rajahmundry

గర్జిస్తున్న గోదారి

గర్జిస్తున్న గోదారి

 

మన్యంలో భారీ వర్షాలతో మళ్లీ వరద పోటు

ధవళేశ్వరం వద్ద ఉదయం ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక

ఉపసంహరణ..సాయంత్రం తిరిగి జారీ

భీతిల్లుతున్న దేవీపట్నం మండల ప్రజలు

కోనసీమ లంక గ్రామాల్లోనూ ఆందోళన

ముంపు ప్రాంతాల్లో జలవనరుల శాఖ మంత్రి పర్యటన

 

రాజమహేంద్రవరంలో సరస్వతీ ఘాట్‌ వద్ద గోదావరి పరవళ్లు

Roaring Godari

రాజమహేంద్రవరం  : గోదావరికి మళ్లీ వరద ఉద్ధృతి పెరుగుతోంది. మంగళవారం ప్రవాహ తీవ్రత కాస్త తగ్గడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

కానీ అదే రోజు మన్యంలో కుండపోతగా కురిసిన వర్షాలతో వివిధ ఉప నదులు, వంకలు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలంలో అత్యధికంగా 21.04 సెం.మీ వర్షపాతం నమోదైంది.

ఏజెన్సీలోని ఇతర మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. దీనికితోడు మన్యంలో ఉన్న జలాశయాలన్నీ ఇప్పటికే నీటితో నిండి ఉండటంతో గేట్లను ఎత్తివేసి దిగువకు విడుదల చేస్తున్నారు.

ఈ నీరంతా గోదావరిలో కలుస్తుండటంతో వరద పోటెత్తుతోంది. ఇప్పటికే వారం రోజులుగా గోదావరి ఉరకలేస్తూ ప్రవహిస్తుండగా తాజా వర్షాలు వరద తీవ్రతను మరింత పెంచాయి.

ఈ పరిణామం ఏజెన్సీలోని దేవీపట్నం తదితర మండలాలతో పాటు కోనసీమలోని లంక గ్రామాల ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

బుధవారం ఉదయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.70 అడుగులకు తగ్గడంతో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికను జలవనరుల శాఖ అధికారులు ఉపసంహరించారు.

కానీ సాయంత్రానికి తిరిగి నీటిమట్టం 12.20 అడుగులకు చేరడంతో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గురువారం వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

అమలాపురం డివిజన్‌లో 16 లంక గ్రామాలు ఇప్పటికే వరద బారిన పడ్డాయి. బుధవారం ఉద్ధృతి కాస్త తగ్గడంతో పారిశుద్ధ్య చర్యలకు ఉపక్రమించినట్లు ఆర్డీవో వెంకటరమణ తెలిపారు.

భారీ వర్షాలు, గోదావరికి వరదల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యగా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ బుదవారం జిల్లాలో పర్యటించారు. ఈమేరకు ఆయన దేవీపట్నం మండలంలో ముంపునకు గురైన గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.

పోలవరం ముంపు బాధితులకు వచ్చే ఏడాది జూన్‌ నాటికి పునరావాసం కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

పోశమ్మగండి, పూడిపల్లి, తొయ్యేరు తదితర ప్రాంతాల్లో అనిల్‌కుమార్‌ యాదవ్‌ పర్యటించారు. ఆయనతో పాటు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ధనలక్ష్మి తదితరులు పర్యటించారు.

 

తాగునీటికి ఇబ్బందులు

గోదావరి వరదలతో దేవీపట్నం మండలంతో పాటు కోనసీమలోని పలు లంక గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.

దీంతో తాగునీటి సరఫరా స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాక్షికంగా నీట మునిగిన ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లలేదు.

బోర్లు, బావులు నీటమునగడంతో కలుషిత నీటినే తాగాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షిత నీటి కోసం పడవల్లో ప్రయాణించి తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.

రాజవొమ్మంగి మండలం జడ్డంగిలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మడేరు వాగు

దేవీపట్నంలోని ముంపు ప్రాంతాల్లో బుధవారం పర్యటిస్తున్న

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, చిత్రంలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తదితరులు

 

మామిడికుదురు మండలం పాశర్లపూడి కరకట్ట వద్ద ముంపులో తాగునీటి కోసం స్థానికుల పాట్లు

 

ఆలమూరు మండలం బడుగువాని లంకలో వరదనీటిలో కుళ్లిపోయిన వంగ తోటను చూపుతున్న రైతు