Loading...

Explore Projects Across the Rajahmundry

Poor

పేదింటికి పెద్దపీట

పేదింటికి పెద్దపీట

జిల్లా కోడలి తొలిపద్దుపై ఆసక్తి

కేంద్ర బడ్జెట్‌పై అధికార, ప్రతిపక్ష నేతల పెదవివిరుపు

గృహనిర్మాణం, మహిళల ఆర్థికాభివృద్ధిపై ఆశలు

భీమవరంలో నిర్మించిన ఇళ్లు

పశ్చిమ కోడలు నిర్మలా సీతారామన్‌ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ను జిల్లా ప్రజానీకం ఆసాంతం ఆసక్తిగా గమనించింది. పేద, మధ్య తరగతి వర్గాలకు గృహాలు, తాగునీరు, విద్యుత్తు వంటి మౌలిక అవసరాలు తీరేలా..

యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడేలా నైపుణ్య శిక్షణ వంటి వాటికి బడ్జెట్‌లో పెద్దపీట వేయడం ఆకట్టుకుంది. అయితే ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంపై జిల్లాలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు పెదవి విరిచాయి.

పాలకొల్లు, న్యూస్‌టుడే : పేద, మధ్య తరగతి వర్గాలకు సంబంధించి సొంతింటి కల తీరే దిశగా ఈ బడ్జెట్‌లో గృహ నిర్మాణాలకు పెద్దపీట వేశారు. రానున్న మూడేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద అందరికీ పక్కా గృహాలను నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది.

ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం అమలు జరుగుతున్నా మరింత ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. మరో రెండేళ్లకు అన్ని గృహాలకు తాగునీరు, గ్యాస్‌, విద్యుత్తు వంటి సదుపాయాలు సమకూరనున్నాయి.

అందరికీ గృహాలు’ పథకానికి సంబంధించి జిల్లాలోని పట్టణ ప్రాంతాలైన పాలకొల్లు, తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాల్లో 20 వేలకు పైగా గృహాలు నిర్మించారు. మిగిలిన పట్టణాలకూ మంజూరైనా నిర్మాణాలు మొదలు కావాల్సి ఉంది.

ఆయా పట్టణాల్లో ఇల్లులేని నిరుపేద వర్గాలు గృహాలు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాయి. జిల్లాలోని తొమ్మిది పట్టణాల్లో కలిపి పదివేల మందికిపైగా ఆశ పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సొంతింటి కోసం పేద, మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు.

జిల్లా మొత్తమ్మీద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 40 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. దాదాపు పది లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నాయి. వీరిలో పేద, మధ్య తరగతి వర్గాలకు సంబంధించి పది శాతం మందికి ఇప్పటికీ సొంతగృహాలు లేవు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గతంలో గృహ నిర్మాణాలు పెద్దఎత్తున జరిగినా సొంత స్థలాలు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో సొంతిళ్లను సమకూర్చుకోలేకపోయారు. ఇప్పుడు అత్యధికులు సొంత గృహాలను నిర్మించుకునే అవకాశం కలగనుంది.

రైతులకు ఊరట

వ్యవసాయమే జీవనాధారంగా 70 శాతం మంది జీవిస్తున్నారు. జిల్లా మొత్తమ్మీద అయిదు లక్షలకు పైగా రైతులు ఉన్నారు. ప్రధానంగా వరితోపాటు ఇతర పంటలు విస్తరించాయి. ఏటా రైతులు వ్యవసాయ ఉత్పత్తుల్లో ఆటుపోట్లను తట్టుకుంటూ చివరకు నష్టాన్నే చవిచూస్తున్నారు. ప్రధానంగా అధిక పెట్టుబడులకు అప్పులపై ఆధారపడుతున్నారు.

ఈ తరుణంలో కేంద్ర ఆర్థిక ప్రణాళికలో రైతుల ఆదాయం రెట్టింపయ్యేలా పెట్టుబడి లేని వ్యవసాయం ద్వారా వారిని ఆదుకోనున్నట్లు ప్రకటించింది. చిన్న వ్యయాలతో అంతర పంటలు వేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రధాన పంటలకు ఉపయోగించడమే దీని ఉద్దేశం. ఇది పాత పద్ధతే అయినా మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది.

యువతకు భరోసా

నిరుద్యోగ సమస్య తీరేలా యువతకు భరోసా కల్పించనున్నారు. ప్రధానంగా పనే దైవం అనే లక్ష్యంతో పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా నైపుణ్యాన్ని పెంచేవిధంగా యువత, విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కేంద్రం అమలు జరపనుంది. ప్రధానంగా విదేశాల్లో సైతం ఉద్యోగాలు పొందేలా ‘కౌశల్‌ వికాస్‌ యోజన పథకం’ ద్వారా ఉన్నత విద్యావంతులకు వారిలో నైపుణ్యాల వృద్ధికి పెద్దపీట వేయనున్నారు.

అందుకు పలు అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. రాబోయే కాలంలో ఎదురయ్యే ఉద్యోగాల కొరతను మన యువత తట్టుకునేలా ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది. దీనివల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు పెద్దఎత్తున అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారు. ఇప్పటికే అధికమంది ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, విదేశాలపై ఆధారపడుతున్నారు. మన జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని పరిశ్రమలు పెరిగితే యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి.

మహిళలకు ‘రుణ’ ముద్ర

మహిళలకు ఈ బడ్జెట్‌ ద్వారా ప్రభుత్వం ఆర్థికంగా చేయూత అందించనుంది. ప్రధానంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన ప్రతి మహిళకు ముద్ర రుణంగా రూ.లక్ష ఇస్తామని తెలిపింది. దీనివల్ల మహిళలు కొంత ఆర్థికంగా బలోపేతం కానున్నారు. జిల్లా మొత్తమ్మీద పట్టణ, గ్రామాల్లో కలిపి 71,874 సంఘాలున్నాయి. ఆయా సంఘాల్లో 7,08,760 మంది మహిళలు సభ్యులున్నారు.

ప్రస్తుతం సంఘాల వారీగా బ్యాంకులు రుణాలను అందిస్తున్నాయి. అదికూడా రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలలోపు మాత్రమే. కేంద్ర ప్రభుత్వ కొత్త నిర్ణయంతో ప్రతి సభ్యురాలికి రూ.లక్ష చొప్పున రుణం పొందే అవకాశం కలుగుతుంది. అదికూడా సకాలంలో చెల్లించిన వారికి మూడుసార్ల వరకు ఇవ్వనున్నారు. ఇది అమలు జరిగితే మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు ముద్ర రుణాలు చిన్నపాటి వర్తకులకు మాత్రమే అందుతున్నాయి.