Loading...

Explore Projects Across the Rajahmundry

phoni cyclone alert in districts Preparing auxiliary activities

జిల్లాలో హైఅలెర్ట్


జిల్లాలో హైఅలెర్ట్

 

ఫొని తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీర మండలాల్లో సహాయక చర్యలకు సన్నద్ధం

ధాన్యం కొనుగోళ్లు 24 గంటలు కొనసాగించాలి

అధికారులతో కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సమీక్ష

సమీక్షిస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, హాజరైన అధికారులు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను సోమవారం మధ్యాహ్నానికి మచిలీపట్నానికి ఆగ్నేయంగా 990 కి.మీ వద్ద కేంద్రీకృతమై ఉందని,

ఇది వాయువ్య దిశలో మచిలీపట్నం వైపు కదులుతూ మంగళవారం మధ్యాహ్నం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా మరలి ఒడిశా వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

అంచనాలకు విరుద్ధంగా దిశ మరలకుండా నేరుగా ముందుకు సాగితే జిల్లాపై ఫొని తుపాను ప్రభావం ఉంటుందని సూచించింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అప్రమత్తం చేశారు.

జిల్లాలో హై అలర్ట్‌ కొనసాగించాలని సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా స్థాయి అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.

ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అంచనా ప్రకారం తుపాను ఒడిశా వైపు మరలినా జిల్లాలో తీరానికి సమాంతరంగా పయనిస్తుందని, దీంతో తీర మండలాల్లో పెనుగాలులు, వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు.

మత్స్యశాఖ అధికారుల సమాచారం మేరకు సముద్రంలో వేటకు ఎవరూ వెళ్లలేదని తెలిపారు.

తుపాను సహాయక చర్యలకు నియమించిన ప్రత్యేక అధికారులు మంగళవారం ఉదయానికి కార్యస్థానాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

20 మండలాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని, అక్కడ పూర్తి స్థాయిలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

తీర ప్రాంత మండలాల్లో తాగునీటి పథకాలకు పూర్తి సామర్థ్యానికి నింపి ఉంచాలన్నారు.

రేషన్‌ దుకాణాల్లో నిత్యావసర సరకుల నిల్వలు అందుబాటులో ఉంచాలన్నారు.

కాయగూరలు సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్తు అంతరాయంతో సమాచార వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తకుడా ఉండేందుకు సెల్‌ టవర్ల వద్ద డీజిల్‌, జనరేటర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ప్రథమ చికిత్స, అత్యవసర వైద్య సేవలకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల నిల్వలు తగిన పరిమాణంలో ఉంచాలన్నారు.

అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని, అక్కడ పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఆదేశించారు.

రైతులు ఒబ్బిడి చేసిన ధాన్యం తుపానుతో ప్రభావితం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

24 గంటలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంచాలన్నారు.

విద్యుత్తు అంతరాయం ఏర్పడితే పునరుద్ధరించడానికి తీర ప్రాంతంలో ఉన్న అన్ని విద్యుత్తు ఉప కేంద్రాల్లో స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్‌ తీగలు, ఇన్సులేటర్లు నిల్వ చేయాలని ఆదేశించారు.

అవసరమైన కార్మికులను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

కలెక్టరేట్‌తో పాటు కాకినాడ, పెద్దాపురం, అమలాపురం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు కొనసాగించాలని ఆదేశించారు.

అనంతరం ఆయన గృహనిర్మాణం, సంక్షేమ కార్పొరేషన్ల యూనిట్ల గ్రౌండింగ్‌, ఉపాధి హామీ పథకం, వివిధ ప్రాజెక్టుల పనులపై సమీక్షించారు.

సమావేశంలో జేసీ మల్లికార్జున, జేసీ-2 సత్తిబాబు, డీఆర్వో ఎంవీ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.