Loading...

Explore Projects Across the Rajahmundry

operation

ఆపరేషన్ రాయల్ వశిష్ఠ

ఆపరేషన్ రాయల్ వశిష్ఠ

కచ్చులూరు మందం… రెండు కొండల మధ్యగా అత్యంత లోతైన నదీ ప్రాంతం.. నీటి ప్రవాహ వేగం చాలా అధికం. లోపల బురద, ఆపై వడు పెద్ద సుడిగుండాలు.. ఇదీ ఈ నెల 15న రాయల్‌ వశిష్ఠ పర్యాటక బోటు ప్రమాదానికి గురైన ప్రదేశంలో ఉన్న పరిస్థితులు… ఇప్పుడు అక్కడ మునిగిన బోటును వెలికితీసే ప్రక్రియ చేపడుతుండటంతో అందరి చూపూ అటువైపు ఉంది.

ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం

ఘోర ప్రమాదం జరిగి 15 రోజులైంది… గల్లంతైన వారిలో 15 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు.. తమ వారి కడచూపు అయినా దక్కుతుందన్న బంధువుల ఆశ నెరవేరలేదు… చివరకు వారి ఆనవాళ్లయినా చూపిస్తే చాలని కనిపించిన వారినల్లా వేడుకున్నా.. ఫలితం దక్కలేదు… వారి హృదయాల్లో వేదన ఉప్పొంగుతున్నా… వెక్కివెక్కి ఏడ్ఛి. కళ్లలో నీళ్లన్నీ ఇంకిపోయాయి…

ఇప్పుడు బోటును వెలికితీసే ప్రక్రియ చేపడతారని తెలిసి స్వగ్రామాలకు వెళ్లిన వారంతా రాజమహేంద్రవరం చేరుకుంటున్నారు.. దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద ఈ నెల 15న మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ పర్యాటక బోటు వెలికితీతకు చర్యలు చేపడుతుండడంతో తమవారి ఆచూకీ తెలుస్తుందేమోనన్న ఆత్రుత బాధితులందరిలోనూ వ్యక్తమవుతోంది.

బోటు మునిగిపోయిన రోజు నుంచి దాదాపు 12 రోజుల పాటు తమ వారి ఆచూకీ కోసం ఎదురు చూసిన బంధువులు చివరికి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఇక తమ వారు లేరనే అభిప్రాయంతో కొంత మంది అంతిమసంస్కారాలు చేశారు. బోటు వెలికితీసే చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్‌ ప్రకటించిన నేపథ్యంలో తమవారి ఆనవాళ్లు అయినా దొరుకుతాయని ఆశగా చూస్తున్నారు. అయినా వీరంతా సోమవారం తిరిగి రానున్నారు.

ఆచూకీ లభించని వారు బోటు లోపల ఏసీ గదుల్లో ఉండి ఉంటారని ఎప్పట్నుంచో అనుమానిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం బోటులో 77మంది ప్రయాణించగా, ప్రమాదం తరువాత 26 మంది సురక్షితంగా బయట పడ్డారు. తొలిరోజు మృతిచెందిన వారితో కలిపి ఇప్పటివరకు 36 మృతదేహాలను గుర్తించారు. ఇంకా 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బోటును వెలికితీస్తే వీరి ఆచూకీ తెలుస్తుందని అందరూ భావిస్తున్నారు.

చేపడతారిలా..

బోటు మునిగిన ప్రాంతంలో ఒక బోటు, పంటును ఉంచుతారు. ఒడ్డున క్రేన్‌, పొక్లెయిన్‌ ఉంచుతారు. లంగర్లను నీటిలోకి వదిలి బోటు మునిగిపోయిన ప్రాంతంతో గాలిస్తారు. లంగరుకు బోటు తగిలిన తరువాత దానికున్న వైర్‌రోప్‌తో బయటకు లాగుతారు. ఆపరేషన్‌ అంతా సక్రమంగా జరిగితే సోమవారం సాయంత్రం లేదా మంగళవారానికి బోటును వెలికితీస్తామని ధర్మాడి సత్యం బృందం సభ్యులు చెబుతున్నారు.

బోటు వెలికితీతపై చర్చలు జరుపుతున్న ధర్మాడి సత్యం బృందం

కట్టుదిట్టమైన భద్రత