Loading...

Explore Projects Across the Rajahmundry

no

మందులు లేవు కరవద్దు ప్లీజ్

మందులు లేవు కరవద్దు ప్లీజ్

ఆరేళ్లలో జిల్లాలో 29 రేబిస్‌ మరణాలు

వేల సంఖ్యలో కుక్కకాటు బాధితులు

సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు నెలన్నరగా నిలిచిన వ్యాక్సిన్‌ సరఫరా

వైద్యశాలల్లోనూ అరకొర నిల్వలే.. కొన్నిచోట్ల ప్రైవేటుగా కొనుగోలు..

కాకినాడలో వాహన చోదకుడిపై కుక్కల దాడి

ఈనాడు, కాకినాడ : శునకాలు బెంబేలెత్తిస్తున్నాయి.. వెంటపడి పిక్కలు పీకేస్తున్నాయి.. జిల్లాలో వీటి బెడద ఎక్కువవడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా జిల్లావ్యాప్తంగా 30 వేల నుంచి 40 వేల మంది కుక్కకాటు బాధితులు నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వీటి నియంత్రణకు కు.ని శస్త్రచికిత్సలు చేయాలని ఆదేశాలున్నా.. అమలు మాత్రం అంతంతమాత్రంగానే ఉండడంతో సమస్య జటిలమవుతోంది.

ఈ పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లు లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో శునక బాధితుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. పట్టణాలు పల్లెల్లో ఏవ΄ల చూసినా, సందుల్లో చూసినా గుంపులు గుప్పులుగా కుక్కలు తిరుగుతూ పాదచారులను, ద్విచక్ర వాహన చోదకులను పరుగులు పెట్టిస్తున్నాయి.

జిల్లాకేంద్రం కాకినాడతోపాటు.. జిల్లాలో కీలకమైన రాజమహేంద్రవరంలోనూ ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. జిల్లా కేంద్రం కాకినాడలోని కేంద్ర ఔషధ భాండాగారం (సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌)లో గత నెలన్నరగా కుక్కకాటు వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. పై నుంచి సరఫరా నిలిచిపోవడంతో జిల్లాలోని 206 వైద్యశాలలకు సరఫరా చేసే పరిస్థితి లేదు. కాకినాడ జీజీహెచ్‌తో పాటు మరికొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే నిల్వలు ఉన్నాయి.

రాజమహేంద్రవరంలోని వైద్యవిధాన పరిషత్తు జిల్లా వైద్యశాలతో పాటు, ఇతర వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న నిల్వలను వాడేశారు. కొన్నిచోట్ల ఆసుపత్రి నిధుల నుంచి ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. తక్షణమే యాంటీ రాబిస్‌ వ్యాక్సిన్‌ సరఫరా చేయకపోతే.. బాధితులు ప్రైవేటుగా కొనుక్కుని సేవలు పొందాల్సిన పరిస్థితి ఎదురుకానుంది.
మరణ శాసనం..
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖ జిల్లా శివారు ప్రాంతాల రోగులూ వస్తుంటారు. గత ఆరేళ్ల ఆసుపత్రి గణాంకాలు పరిశీలిస్తే కుక్కకాటు బాధితుల్లో 29 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. 2016లో అత్యధికంగా ఏడు రేబిస్‌ మరణాలు నమోదైతే.. ఈ ఏడాది ఆగస్టు వరకు అయిదు రేబిస్‌ మరణాలు నమోదు కావడం గమనార్హం. మృతుల్లో జిల్లాలోని కాట్రేనికోనకు చెందిన ఇద్దరు ఉండడం గమనార్హం.
సామర్లకోటకు చెందిన ఇద్దరు వ్యక్తులు గతేడాది రేబిస్‌ వ్యాధితో బాధపడుతూ మృతిచెందారు.
తీవ్రత ఇలా…
రాజవొమ్మంగి మండలంలో ఆగస్టు 21న పిచ్చికుక్క దాడి చేసింది. ముఖంపై, శరీరంపై తీవ్ర గాయాలైన అయిదేళ్ల చిన్నారి గ్రేస్‌పుష్ప చికిత్స పొందుతూ ఈనెల 15న మృతిచెందింది.
కాకినాడ గ్రామీణ పరిధిలోని ఇంద్రపాలెంలో వీధిలో అడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై గతేడాది నాలుగు కుక్కలు దాడిచేసి తలపై, శరీరంపై తీవ్రంగా గాయపరిచాయి. స్థానికుల చొరవతో ప్రాణాపాయం తప్పింది.
రాజోలు, శివకోడు, మట్టపాడు తదితర ప్రాంతాల్లో పిచ్చికుక్కు దాడిచేసి 15 మందిని కరిచింది.
గొల్లప్రోలులో గతంలో పిచ్చికుక్కు స్వైర విహారంతో 10 మంది ఆసుపత్రి పాలయ్యారు.
మలికిపురంలో కుక్కల దాడిలో చిన్నారి సహా నలుగురు గాయపడ్డారు.