Loading...

Explore Projects Across the Rajahmundry

మన్యం ఘోషకు మందేదీ..?

మన్యం ఘోషకు మందేదీ..?

గర్భిణులకు తప్పని ప్రసవ వేదన

సరైన రవాణా వసతి లేక అత్యవసర పరిస్థితుల్లో జడ్డీలే దిక్కు

ముందస్తు కార్యాచరణ అమలులో యంత్రాంగం వైఫల్యం


ఎటపాక మండలం కామనతోగు వలస గ్రామం నుంచి గురువారం

నిండు గర్భిణిని జడ్డీలో మోసుకొస్తున్న స్థానికులు

జిల్లాలోని మన్యం ప్రాంతంలో మాతాశిశు మరణాల నివారణకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లోపంతో అవి సత్ఫలితాలివ్వడం లేదు.

దీంతో ఇక్కడ మాతాశిశు మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఏజెన్సీలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వైద్య సేవలు మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు వెచ్చిస్తున్నాయి.

ప్రధానంగా మాతాశిశు మరణాలను నివారించడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వాలు దీనికి ప్రత్యేక కార్యాచరణను సైతం రూపొందించినా ఫలితం ఉండటం లేదు.

మారుమూల ప్రాంతాల్లో సంభవిస్తున్న ఈ మరణాలను వైద్య, ఆరోగ్య శాఖతో పాటు ఐసీడీఎస్‌ సిబ్బంది సరిగా నమోదు చేయడం లేదు.

చింతూరు, ఎటపాక : మన్యంలో ఎటపాక మండలం కామన్‌తోగు వలస ఆదివాసీ గ్రామంలో తాజాగా చోటుచేసుకున్న సంఘటన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనంలా నిలుస్తుంది.

ఆ గ్రామానికి చెందిన వెట్టి భీమి నిండు గర్భిణి. బుధవారం రాత్రి నుంచి ఆమెకు ప్రసవ నొప్పులు రావడంతో గ్రామం నుంచి ఎటూ వెళ్లేందుకు వీలు లేక అక్కడే ఉంచారు.

గురువారం ఉదయం గౌరిదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఫీడర్‌ అంబులెన్స్‌కు ఆమె కుటుంబ సభ్యులు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు.

విధుల్లో ఉన్న ఫీడర్‌ అంబులెన్స్‌ ఈఎంటీ పెట్టెం నవీన్‌ హుటాహుటిన గ్రామానికి బయలుదేరినా సరైన రహదారి సౌకర్యం లేక మురుమూరు ప్రధాన రహదారి నుంచి కొంత దూరం వెళ్లి అక్కడ వాహనాన్ని నిలిపివేశారు.

ఈ సందర్భంలోనే గర్భిణి భీమి తీవ్ర ప్రసవ వేదనకు గురికావడంతో స్థానికులు మంచాన్ని జడ్డీలా కట్టుకుని 10 కిలోమీటర్లు మోసుకుంటూ తీసు కొచ్చారు.

సమాచారం అందుకున్న ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు గర్భిణిని ఫీడర్‌ అంబులెన్స్‌ వద్దకు తరలించారు.

గౌరిదేవిపేట పీహెచ్‌సీ భవనానికి మరమ్మతులు జరుగుతుండడంతో ఆమెను కూనవరం సీహెచ్‌సీకి తరలించేందుకు ఫీడర్‌ అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా నర్సింగపేట వద్దకు 108 వాహనం రావడంతో గర్భిణిని అందులోకి తరలించి సీహెచ్‌సీకి తీసుకెళ్లారు.

అంగన్‌వాడీ, వైద్య శాఖల కుమ్మక్కు

వాస్తవంగా మన్యంలో గర్భిణులు, బాలింతల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాల్సి ఉంది.

గర్భం దాల్చిన సమయం నుంచి అక్కడి మహిళల ఆరోగ్య పరిరక్షణపై వైద్య, ఆరోగ్యం, ఐసీడీఎస్‌ యంత్రాంగం ప్రత్యేక దృష్టి నిలపాలి.

గర్భిణులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, సలహాలు అందజేయాలి. ప్రసవ సమయానికి ముందుగానే వారిని సంబంధిత వైద్యశాలలకు తరలించి వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలో ఉంచాలి.

ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా జరిగితే మాతాశిశు మరణాలను నివారించే అవకాశమున్నా దీనిని ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు.

దీని ఫలితంగానే గర్భిణులు ప్రసవ సమయం దగ్గరపడే వరకు తమ ఇళ్ల వద్దే ఉంటూ అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్యసేవలు అందక తల్లీబిడ్డల మరణాలకు దారితీస్తోంది.

ఈ ఏడాది విలీన మండలాల్లో 43 మాతాశిశు మరణాలు సంభవించినట్లు అధికార లెక్కలు వెల్లడిస్తున్నా వాస్తవంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటోంది.

పౌష్టికాహారలోపం

మన్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పౌష్టికాహారం లోపాన్ని నివారించి వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పలు రకాలు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా ఐరన్‌ మాత్రలు అందజేయడంతో పాటు టీకాలు వేయాల్సి ఉన్నా ఈ కార్యక్రమాలు సరిగా అమలు జరగడం లేదు. దీనిపై సరైన పర్యవేక్షణ కొరవడడం స్థానికులకు శాపంలా పరిణమించింది.

మాతా, శిశు మరణాల నివారణకు చర్యలు

మన్యంలో మాతాశిశు మరణాలను తగ్గించేందుకు గట్టి చర్యలు చేపడుతున్నాం. ఈ మరణాలను విధిగా నమోదు చేసేలా చూస్తాం. వైద్య, ఐసీడీఎస్‌ సిబ్బందిని సమన్వయం చేసి గర్భిణులకు మెరుగైన వైద్యాన్ని అందించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. మారుమూల గ్రామాల్లో గర్భిణులను ప్రసవ సమయానికి ముందే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ పుల్లయ్య, జిల్లా ఉప వైద్యాధికారి, చింతూరు