Loading...

Explore Projects Across the Rajahmundry

ఒకటి నుంచి హెల్మెట్‌ వాడకం తప్పనిసరి

ఒకటి నుంచి హెల్మెట్‌ వాడకం తప్పనిసరి

ఒకటో తేదీ నుంచే జిల్లాలో అమలు

15 వరకు వాహన చోదకులకు అవగాహన.. అనంతరం జరిమానాల విధింపు
రహదారి భద్రత సమావేశంలో కలెక్టర్‌ స్పష్టీకరణ

రహదారి భద్రత కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

కాకినాడ కలెక్టరేట్ : వచ్చేనెల ఒకటి నుంచి జిల్లాలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు, నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు సీటుబెల్ట్‌ విధిగా ధరించాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సూచించారు.

మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 1,345 రోడ్డు ప్రమాదాలు జరిగ్గా, 513 మంది మృతి చెందారన్నారు.

వచ్చే నెల 1 నుంచి 15వ తేదీ వరకు హెల్మెట్లు, సీటు బెల్టులు వినియోగంపై అవగాహన కల్పిస్తామన్నారు. 16వ తేదీ నుంచి వీటిని ధరించకపోతే జరిమానా విధిస్తారని చెప్పారు.

రోడ్డు ఆడిట్‌ ఆధారంగా జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్‌శాఖ రోడ్లపై ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లాలో గుర్తించిన బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణకు స్పీడ్‌గన్లు ఏర్పాటు చేయాలన్నారు.

పట్టణ ప్రాంతాల్లో సంచరిస్తున్న పశువులను ఏజెన్సీ ప్రాంతానికి తరలించి, గిరిజనుల సంరక్షణలో ఉంచాలని సూచించారు.

రవాణా శాఖ ఉప కమిషనర్‌ సీహెచ్‌ ప్రతాప్‌ మాట్లాడుతూ జిల్లాలో జులై నెల్లో 186 రోడ్డు ప్రమాదాలు సంభవించిగా, 63 మంది మరణించారని, 200 మంది గాయపడ్డారని చెప్పారు.

జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి, రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ షీమోషి బాజ్‌పాయ్‌ రోడ్డు ప్రమాదాల పరిస్థితిని వివరించారు.

సమావేశంలో ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ బహ్మానందరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

బాలల సంరక్షణ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి బాలల సంరక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

జిల్లాలోని 29 బాలల సంరక్షణ కేంద్రాల్లో ప్రతి నెలా అధికారులు విధిగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాలల సంరక్షణ కేంద్రాల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. సమావేశంలో జేసీ-2 రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో పొరుగుసేవల పద్ధతిపై నియమించిన ఉద్యోగులకు విధిగా పీఎఫ్‌ జమ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పొరుగుసేవల ఉద్యోగుల నుంచి సేకరించే పీఎఫ్, సర్వీస్‌ ట్యాక్స్‌లను సంబంధిత ఖాతాలకు జమ చేయాలని ఆదేశించారు. వీటిని నిర్వహిస్తున్న ఏజెన్సీలు సక్రమంగా చెల్లింపులు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ కె.శాంతి తదితరులు పాల్గొన్నారు.

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిరోధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ చట్టంపై ఏర్పాటైన జిల్లా సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెట్టాలని, తరుచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో నాల్గవ అదనపు ప్రిన్సిపల్‌ సివిల్‌ కోర్టు జడ్జి ఎన్‌.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సీఎం వీడియో కాన్ఫరెన్స్‌..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, జేసీ లక్ష్మీశ, డీఆర్వో సత్తిబాబు తదితరులు హాజరయ్యారు. స్పందన కార్యక్రమంపై జిల్లాకు ప్రథమ స్థానం రావడంపై సీఎం జిల్లా అధికారులను అభినందించారు. సీఎం సూచించిన అంశాలను అమలు చేయడానికి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ తెలిపారు.

29న ఫిట్‌ ఇండియా కార్యక్రమం

ఈ నెల 29న జిల్లాలో ఫిట్‌ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ దిల్లీలో ప్రారంభిస్తారని, ఇక్కడ వీక్షించడానికి అన్ని ప్రాంతాల్లో తెరలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం 8 గంటలకు కాకినాడ జేఎన్‌టీయూ నుంచి జిల్లా క్రీడా మైదానం వరకూ 2కే రన్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.