Loading...

Explore Projects Across the Rajahmundry

గోదావరి ఉగ్రరూపం

ముంగిట ముప్పు

గోదావరి ఉగ్రరూపం

అప్పనపల్లి వద్ద కాజ్‌వేపై ఇద్దరి గల్లంతు

పోలవరం ఎగువ కాఫర్‌డ్యాం వద్ద నది మధ్యలో చిక్కుకున్న 31 మంది మత్స్యకారులు

● నేవీ హెలికాప్టర్‌ సహాయంతో సురక్షిత ప్రాంతానికి బాధితుల తరలింపు

రాజమహేంద్రవరంలో గోదావరి వరద ఉద్ధృతి

 

Godavari Flood

కాకినాడ  : వాన వరదైంది.. గోదావరి ఉగ్రరూపంతో మన్యంతో పాటు కోనసీమలో ఊళ్లను నీరు ముంచెత్తింది. విద్యుత్తు సరఫరాలేక రోజుల తరబడి గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి..గూడుతో పాటు సర్వం వదిలి పిల్లాపాపలతో పునరావాస కేంద్రాలను ఆశ్రయించాల్సిన దయనీయ పరిస్థితి వేలాది కుటుంబాలకు ఎదురైంది.

జీవనాధారం సైతం వరదపాలయ్యే పరిస్థితి ఎదురవుతోంది. కంటినిండా కునుకులేక.. కడుపు నిండా తిండిలేక.. వరద మిగిల్చిన కష్టాలతో బాధితులు తల్లడిల్లుతున్నారు.

మరోవైపు పోలవరం ఎగువ కాఫర్‌డ్యాం వద్ద గోదావరిలో చిక్కుకున్న 31 మంది మత్స్యకారులు తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య బయటపడ్డారు.

వీరు ప్రయాణిస్తున్న పడవలు ప్రతికూల పరిస్థితులతో గురువారం రాత్రి వీరపులంక సమీపంలో ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిలిచిపోయాయి. దీంతో బాధితులంతా కాఫర్‌డ్యాంపైకి చేరుకుని రాత్రంగా బిక్కుబిక్కుమంటూ గడిపారు.

శుక్రవారం ఉదయం ఈ సమాచారం అందుకున్న అధికారులు నేవీ హెలికాప్టర్‌ను రప్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి యంత్రాంగంతో సమీక్షించారు. గోదావరి మధ్య చిక్కుకున్న మత్స్యకారులు పడవలు, సామగ్రిని విడిచి రాలేమని మొండికేయడంతో వారి ప్రతినిధితో కలెక్టర్‌ ఫోన్‌లో మాట్లాడారు.

పడవలు ఒడ్డున కట్టేయాలని, వరద తీవ్రత తగ్గాక వాటిని తెప్పించే చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇవ్వడంతో వారు శాంతించారు.

గోదావరి వరద ఉద్ధృతితో మామిడికుదురు మండలం అప్పనపల్లి వద్ద కాజ్‌వేలో కొట్టుకుపోవడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. జిల్లాలో పక్షం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీని ఫలితంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అటు మన్యం.. ఇటు కోనసీమలోనూ దయనీయ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. పోలవరానికి దిగువన ఉన్న దేవీపట్నం మండల పరిధిలో ఏకంగా 32 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 19 మండలాల పరిధిలోని 118 గ్రామాలు వరదతో కొట్టుమిట్టాడుతున్నాయి. కోనసీమలో విలువైన పంట భూములూ కోతకు గురై నదీ గర్భంలో కలిసిపోతున్నాయి.

అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెంలో నిత్యావసరాల కోసం

వరదనీటిలో నడిచివెళుతున్న స్థానికులు

సాయం అందిస్తున్నా వీడని వేదన..

జిల్లాలోని వరద పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిత్యావసరాలు అందిస్తున్నా ముంపు నుంచి ఉపశమనం కలగకపోవడం బాధితులను ఆందోళనకు గురిచేస్తోంది. సెల్‌ సంకేతాలకు విఘాతం కలగడంతో చింతూరు, రంపచోడవరం పరిధిలో సహాయక చర్యలకు ఇబ్బంది లేకుండా శాటిలైట్‌ ఫోన్లు సమకూర్చారు. మన్యంలో గత కొన్ని రోజులుగా విద్యుత్తు సరఫరా లేక అంధకారం అలముకుంది. హెడ్‌ లైట్లు, సౌర విద్యుత్తు దీపాలు 300 చొప్పున అందించారు. దేవీపట్నం మండలంలోని 32 గ్రామాల్లో దయనీయ కొనసాగుతూనే ఉంది. అల్లవరం మండలం బోడసకుర్రు, పల్లిపాలెంలలో 700 మత్స్యకార కుటుంబాలు ఉండగా నది సమీపంలో ఉన్న పలు ఇళ్లు శుక్రవారం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.ఐ.పోలవరం మండలంలోని గోవుల్లంక, బైరవలంక, కేశనకుర్రు శివారు పొగాకు లంక, వెదుర్లంక శివారు రామాలయం పేట, మురమళ్ల రాఘవేంద్రవారధి సమీపంలోని నివాస గృహాలు, కొమ్మరిగిరిలోని గొట్టివానిపేట నివాస గృహాలను వరద నీరు చుట్టుముట్టింది.

కుక్కునూరు నుంచి గోదావరిలో మత్స్యకారులు వచ్చిన నావలు ఇవే..