Loading...

Explore Projects Across the Rajahmundry

సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షకు విస్తృత ఏర్పాట్లు: కలెక్టర్‌

సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షకు విస్తృత ఏర్పాట్లు: కలెక్టర్‌

481 కేంద్రాల్లో నిర్వహణ, హాజరుకానున్న 2,06,211 మంది అభ్యర్థులు

ముందు రోజు వచ్చే వారికి బస ఏర్పాట్లు

వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

కాకినాడ కలెక్టరేట్‌ : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు.

సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 1, 3, 4, 6, 8 తేదీల్లో నిర్వహించనున్న పరీక్షలకు 481 కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా వ్యాప్తంగా 2,06,211 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.

పరీక్ష రాసే ఓఎంఆర్‌ పత్రంలో అభ్యర్థుల పేర్లు, పరీక్ష కేంద్రాల వివరాలుంటాయన్నారు. వీటి నిర్వహణకు 10వేల మంది ఉద్యోగులను నియమించామన్నారు.

37 మంది ప్రత్యేక అధికారులతో ఫ్లైయింగ్‌ స్కాడ్‌, 102 మంది రూట్‌ అధికారులు, 657 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 6,226 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు తెలిపారు.

అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయిస్తామన్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో అభ్యర్థుల కోసం ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు.

అభ్యర్థులు ఆయా కేంద్రాలకు నిర్ణీత సమయం కంటే గంట ముందుగా రావాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమంతించరని స్పష్టం చేశారు.

ముందురోజు వచ్చే వారికి బస ఏర్పాట్లు..

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షకు దూర ప్రాంతాల నుంచి హాజరయ్యే అభ్యర్థులు ముందురోజే వచ్చి బస చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. రాజమహేంద్రవరంలో బొమ్మన రాజ్‌కుమార్‌ కల్యాణ మండపం (ఇస్కాన్‌ మందిరం వద్ద), కాకినాడలోని అంబేడ్కర్‌ భవనంలో పురషులు, కాకినాడలోని రామారావుపేటలో ఉన్న జిల్లా పరిషత్తు కల్యాణ మండపంలో మహిళలకు బస ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో అడ్డతీగలలో యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, ఐటీడీఏ క్వార్టర్స్‌లో బస ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

దివ్యాంగులకు కోసం..

పరీక్ష రాసేందుకు వచ్చే దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో 2,532 మంది రాయనున్నారని వీరిలో 118 మంది కోసం సహాయకులను అనుమతించినట్లు తెలిపారు.

వీరికి 50 నిమిషాలు అదనపు సమయం కేటాయించినట్లు పేర్కొన్నారు. అవసరమైన వారికి మూడు చక్రాల సైకిళ్లు ఏర్పాటు చేశామన్నారు.

పరీక్ష కేంద్రాలను సులువుగా గుర్తించడానికి సైన్‌బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తీసుకురావాల్సినవి..

పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌ టిక్కెట్టుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు తీసుకురావాలని కలెక్టర్‌ సూచించారు. ఆధార్‌, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఫోటో ఓటరు గుర్తింపుకార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ల్లో ఏదో ఒక ఒరిజినల్‌ పత్రాన్ని తీసుకురావాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమంతించరని తెలిపారు. పరీక్ష నిర్వహణ, నియామకాలు పారదర్శకంగా జరుగుతాయని, దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్‌ సూచించారు. ప్రతిభ ఆధారంగా ఎంపికలు జరుగుతాయన్నారు.

కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు

పరీక్ష నిర్వహణకు కాకినాడలోని జిల్లా పరిషత్తు కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. పరీక్షల కేంద్రాల ఏర్పాటు, ఇతర అవసరాలపై అభ్యర్థులు సందేహాలు ఉంటే కంట్రోల్‌ రూమ్‌ ఫోను నంబర్లను సంప్రదించాలని కోరారు. పరీక్ష నిర్వహణ సిబ్బందికి కూడా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.