Loading...

Explore Projects Across the Rajahmundry

development of colleges

స్థానికుల చొరవతోనే కళాశాలల అభివృద్ధి: డీవీఈవో

స్థానికుల చొరవతోనే కళాశాలల అభివృద్ధి: డీవీఈవో

జూనియర్‌ కళాశాల కార్యాలయ గదిని ప్రారంభిస్తున్న వృత్తివిద్యాధికారి

యర్నగూడెం (దేవరపల్లి), న్యూస్‌టుడే: స్థానికులు, అభివృద్ధి కమిటీల సభ్యులు చొరవ తీసుకుంటేనే కళాశాలల పురోభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా వృత్తివిద్యాధికారి(డీవీఈవో) ఎం.మణేశ్వరరావు అన్నారు. దేవరపల్లి మండలం యర్నగూడేనికి నూతనంగా మంజూరైన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆయన బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవనంలో కేటాయించిన గదిలో కళాశాల కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
కొందరు విద్యార్థులకు ప్రవేశాలను కల్పించారు. ఈ సందర్భంగా డీవీఈవో మాట్లాడుతూ స్థానిక కమిటీలు చొరవ తీసుకున్న ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఎక్కడా లేని విధంగా గోపాలపురం నియోజకవర్గానికి తక్కువ వ్యవధిలోనే రెండు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు మంజూరుకావడం అరుదైన విషయమన్నారు.

గత విద్యాసంవత్సరం చివరలోనే ఈ కళాశాలను ప్రారంభించాల్సి ఉన్నా ఎన్నికల నియమావళి కారణంగా వాయిదా పడిందని వివరించారు. జిల్లాలో 33 ప్రభుత్వ కళాశాలలు ఉండగా 20 చోట్ల విద్యార్థుల సంఖ్య బాగానే ఉందన్నారు. మిగిలిన 13 చోట్ల విద్యార్థులు అంతగాలేరని చెప్పారు. విద్యార్థుల సంఖ్య పెరిగితేనే కళాశాలలకు వసతులు సమకూరుతాయని వివరించారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ నరహరిశెట్టి రాజేంద్రబాబు మాట్లాడుతూ యర్నగూడెంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు ఏడాదిలోగా సొంత భవనం నిర్మించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని కె.శ్రీవాసవి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గద్దే వెంకటరామారావు, మండ పెదబాబు, ఎంపీటీసీ సభ్యుడు బొంతా భరత్‌బాబు, వైకాపా మండల అధ్యక్షుడు కూచిపూడి సతీష్‌, స్థానిక ప్రముఖులు గద్దే మునేశ్వరరావు, దుగ్గిరాల రత్నాజీరావు, ముళ్లపూడి రాజబాబు, నరహరిశెట్టి సుధాకర్‌, మాజీ సర్పంచులు బొల్లిన రామకృష్ణారావు, గుమ్మడి ప్రసాదరావు, కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.