Loading...

Explore Projects Across the Rajahmundry

నాలుగు నెలల్లో కార్గో విమాన సర్వీసులు

నాలుగు నెలల్లో కార్గో విమాన సర్వీసులు

 


కార్గో టెర్మినల్‌ భవనాన్ని పరిశీలిస్తున్న సదరన్‌ జీఎం మురళీధరన్‌,

ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ రాజకిషోర్‌ తదితరులు

Cargo Flights In Four Months

కోరుకొండ : రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి మరో నాలుగు నెలల్లో కార్గో విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎం.రాజకిషోర్‌ పేర్కొన్నారు.

సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో సంబంధిత పనులను పరిశీలించేందుకు చెన్నై నుంచి కార్గో సదరన్‌ జీఎం డి.మురళీధరన్‌ శుక్రవారం రాజమహేంద్రవరానికి వచ్చారు.

ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎం.రాజకిషోర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కార్గో టెర్మినల్‌ భవనాన్ని అన్ని వసతులతో సిద్ధం చేశామన్నారు. ఎయిర్‌లైన్స్‌ సంస్థలతో చర్చించామని, త్వరలో కార్గో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. రన్‌వే విస్తరణతో 180 మంది ప్రయాణించే విమానాల సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

ఇవి కార్గో సర్వీసుకు అనుకూలంగా ఉంటాయన్నారు. షిర్డీ, తిరుపతి, దిల్లీ ప్రాంతాలకు సర్వీసులు నిర్వహించేందుకు ఎయిర్‌ లైన్స్‌ సంస్థలు ముందుకు రానున్నాయన్నారు.

మరో వారంలో ప్రాంతీయ సెక్యూరిటీ అధికారి, ప్రాంతీయ డైరెక్టర్‌ వచ్చి, కార్గో భవనాన్ని పరిశీలిస్తారన్నారు.

కార్గో టెర్మినల్‌ భవనం పరిశీలన

విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్‌ భవనాన్ని జీఎం మురళీధరన్‌, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎం.రాజకిషోర్‌లు పరిశీలించారు. వస్తువుల దిగుమతులు, ఎగుమతుల ప్రాంతాలను చూశారు. రక్షణ పరంగా గార్డులు, మెటల్‌ డిటెక్టర్లు, స్క్రీనింగ్‌ టెస్ట్‌, టచ్‌ స్క్రీన్‌, స్టోరేజ్‌ గదులు, సంబంధిత ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎయిర్‌లైన్స్‌, ఏజెంట్ల కార్యాలయాల ఏర్పాటుపై క్షుణ్నంగా పరిశీలించారు. కార్గో విమాన సర్వీసుల రాకపోకలకు చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్గో టెర్మినల్‌ ఇన్‌ఛార్జి సి.భాస్కర్‌, విమానాశ్రయం అధికారులు, సిబ్బంది వారి వెంట ఉన్నారు.