Loading...

Explore Projects Across the Rajahmundry

అష్టకష్టాల ఆధార్

అష్టకష్టాల ఆధార్

నమోదు కేంద్రాల వద్ద బారులుదీరుతున్న జనం

రోజుకు నిర్దేశిత సంఖ్యలోనే టోకెన్ల జారీతో వెతలు

సర్వర్లు మొరాయిస్తుండటంతో గంటల పాటు తప్పని నిరీక్షణ

తల్లడిల్లుతున్న సామాన్యులు

జిల్లాలో ఆధార్‌ నమోదు, సవరణ ప్రక్రియ ప్రజలకు సంకటంలా తయారైంది. బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఆధార్‌ నమోదు కేంద్రాల్లో నిత్యం పెద్ద సంఖ్యలో జనం బారులుదీరుతున్నారు.

గంటల తరబడి ఈ కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

దీనికితోడు ఒక్కో కేంద్రంలో రోజుకు నిర్దేశిత సంఖ్యలోనే టోకెన్లు జారీ చేస్తుండటంతో ఆధార్‌ నమోదు ప్రక్రియ గందరగోళంగా తయారవుతోంది.

ఈ పరిణామం పేద ప్రజలను తీవ్ర అవస్థలకు గురిచేస్తోంది. ఆధార్‌ నమోదుకు డిమాండ్‌ అధికంగా ఉన్నా నమోదు కేంద్రాల సంఖ్యను మాత్రం తగిన రీతిలో పెంచక పోవడం ప్రతిబంధకంగా మారింది.

రాజమహేంద్రవరం

జిల్లాలో గతంలో ఆధార్‌ నమోదులో పలు లోపాలు చోటుచేసుకున్నాయి. పుట్టిన తేదీలు పేర్కొనక పోవడంతో పాటు ఫోన్‌ నంబరును పొందుపరచకుండానే ఆధార్‌ నమోదు ప్రక్రియను అప్పట్లో చేపట్టారు.

ఈ పరిణామం ప్రస్తుతం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వ పథకాలు, ఇతర పనులకు ఆధార్‌ తప్పనిసరి కాగా.. అందులో పుట్టిన తేదీ, ఫోన్‌ నంబరు ..మిగతా 7లోలేకపోవడంతో వీటిని తిరస్కరిస్తున్నారు.

దీంతో పెద్ద సంఖ్యలో నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆధార్‌ కేంద్రాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కోకుండా పాఠశాలల్లోనే ఆధార్‌ నమోదు చేయిస్తామని గతంలో జిల్లా కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

కానీ సకాలంలో ఆధార్‌ నమోదు చేయించకపోతే పథకాలు వర్తించవేమోన్న ఆందోళన, అవగాహన లేమితో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ పిల్లలతో ఆధార్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు.

దీంతో నమోదు కేంద్రాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొందరికి ఐరిస్‌ సరిగా నమోదు కాకపోవడం, మరికొందరికి వేలిముంద్రలు పడక పోవడంతో ఈ ప్రక్రియలో ఆలస్యమవుతోంది.

ముఖ్యంగా పిల్లలకు కొత్తగా ఆధార్‌ నమోదు చేయాలంటే 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతోంది.ఆధార్‌ నమోదు కేంద్రాల్లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.

ఎక్కువ సార్లు సర్వర్లు పనిచేయక పోవడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రోజుకు 20 టోకెన్లు ఇస్తే సర్వర్లు పనిచేయక కేవలం 10 మందికే ఆధార్‌ నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది.

దీనికితోడు ఆధార్‌ నమోదుకు సంబంధించి ఏమైనా పరికరాలు పాడైతే మరమ్మతుల కోసం జైపూర్‌కు తీసుకెళ్లాల్సి వస్తోంది.

దీనికి సంబంధించి సర్వీస్‌ సెంటర్‌ అక్కడే ఉండటంతో ఈ ప్రక్రియకు కనీసం రెండు వారాల సమయం పడుతోంది.

బ్యాంకుల్లో మొక్కుబడిగా…

కేంద్ర ప్రభుత్వం తపాలా కార్యాలయాలు, బ్యాంకులు, కొన్ని మీసేవ కేంద్రాల్లో మాత్రమే ఆధార్‌ నమోదుకు అనుమతించింది.

కొన్ని బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో సిబ్బంది చురుగ్గానే ఈ సేవలు అందిస్తున్నా మరికొన్ని చోట్ల తగిన రీతిలో స్పందించడం లేదన్న విమర్శలున్నాయి.

తపాలా కార్యాలయాల్లో రాత్రి 8 గంటల వరకు ఆధార్‌ నమోదు చేస్తున్నా బ్యాంకుల్లో మాత్రం సాయత్రం నాలుగు గంటల వరకే అనుమతిస్తున్నారు.

కొన్ని బ్యాంకుల్లో సిబ్బంది కొరత వల్ల ఆధార్‌ నమోదుకు ఒప్పంద ప్రాదిపదికన సిబ్బందిని నియమిస్తున్నారు.

వారు సరిగా విధులు నిర్వహించక పోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

అమలాపురంలోని చైతన్య గోదావరి బ్యాంకుకు ఆధార్‌ నమోదు

కోసం వచ్చి నిరీక్షిస్తున్న ప్రజలు

 

సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఆధార్‌ నమోదు కోసం ఉదయం వెళితే తిరిగి వచ్చే సరికి సాయంత్రం అవుతోంది.

గురువారం రాజమహేంద్రవరం, అమలాపురం తదితర ప్రాంతాల్లోని కొన్ని బ్యాంకుల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వర్లు నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ పరిస్థితిలో జిల్లా ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టి ఆధార్‌ నమోదులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముంది.

త్వరలో మరిన్ని కేంద్రాల ఏర్పాటు

జిల్లాలో త్వరలో మరికొన్ని ఆధార్‌ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. 15 ఏళ్ల లోపు విద్యార్థులకు పాఠశాలల్లోనే ఆధార్‌ నమోదు కార్యక్రమాన్ని చేపడతాం. దీనిపై ఇప్పటికే స్పష్టం చేశాం.

ఆధార్‌ నమోదులో ఆలస్యమవుతోందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పిల్లలను ఆధార్‌ కేంద్రాలకు తీసుకురావాల్సిన అవసరం లేదు.

– డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌