Loading...

Explore Projects Across the Rajahmundry

By 2020 Polavaram project is complete

2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి

2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి

ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌

ఎగువ కాఫర్‌డ్యామ్‌ నిర్మాణం పరిశీలిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు

పోలవరం, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ప్రచార లబ్ధి కోసమే చంద్రబాబు హడావుడిగా ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు పూర్తిచేసి నిర్వాసితులను భయభ్రాంతులకు గురిచేశారని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులను పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి మంగళవారం పరిశీలించారు. జల వనరుల శాఖాధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రానున్న వరదల సమయంలో నిర్వాసితులు ముంపునకు గురికాకుండా, ఎవరికీ నష్టం వాటిల్లికుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అందుకు అవసరమైన చర్యలు ఇంజినీర్లు చేపట్టారని, నిర్వాసితులకు తాము అండగా ఉంటామన్నారు.

ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 70 శాతం పూర్తి చేసినట్లు జల వనరుల శాఖాధికారులు చెప్పారని, మిగిలిన 30 శాతం పనులు 2020 డిసెంబరు నాటికి ముఖ్యమంత్రి జగన్‌ పూర్తి చేస్తారన్నారు. గతంలో ప్రాజెక్టు పనులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పట్టించుకోలేదని, ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేస్తున్న వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు.

తొలుత ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఇన్‌ఛార్జి ఎస్‌ఈ ఆర్‌.రఘురామ్‌ పనులు జరుగుతున్న తీరు గురించి వివరించారు. పోలవరం అథారిటీ సభ్యులు ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు నిలిపివేయమని ఆదేశించారని, దాంతో స్పిల్‌వే కాంక్రీట్‌, స్పిల్‌ఛానల్‌లో మట్టి పనులు జరుగుతున్నట్లు నవయుగ ప్రాజెక్టు మేనేజర్‌ క్రాంతి చెప్పారు. అనంతరం స్పిల్‌వే, కాఫర్‌డ్యామ్‌ నిర్మాణాలను వారు పరిశీలించారు.

తండ్రి ప్రారంభించారు.. తనయుడు పూర్తి చేస్తారు.. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును అతని తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి 2020 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. అప్పట్లోనే ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు కేంద్రం నుంచి తీసుకొచ్చారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ కోసం ఖర్చు చేసిన రూ.2 వేల కోట్లు నిర్వాసితులకు ఖర్చు చేసి ఉంటే ప్రాజెక్టు సకాలంలో పూర్తి అయ్యేదని అన్నారు.

నిర్వాసితులకు ప్యాకేజీ పెంచే విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ సానుకూలంగా ఉన్నారని, త్వరలో సీఎం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు అన్నారు. వారి వెంట ఈఈ ఎం.చంద్రరావు, డీఈలు డీవీ సత్యనారాయణ, శివశంకర్‌, రామకృష్ణ, అనిల్‌, వైకాపా నాయకులు బుగ్గా మురళీకృష్ణ, సుంకర వెంకటరెడ్డి, అల్లు జగన్‌మోహన్‌రావు, బదిరిరెడ్డి అప్పారావు తదితరులు ఉన్నారు.

నిర్వాసితుల కోసం ప్రత్యేకాధికారిని నియమించాలి.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ప్రత్యేకాధికారిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ప్రాజెక్టు క్యాంపు కార్యాలయం వద్ద మాధాపురం నిర్వాసితులు కలిసి ఇప్పటి వరకు తమకు ఎక్కడా ఇళ్ల స్థలాలు చూపించలేదని, ప్యాకేజీ సక్రమంగా అందించలేదని ఎంపీ, ఎమ్మెల్యేలకు వివరించారు. ఎగువ కాఫర్‌డ్యామ్‌ నిర్మాణం వల్ల గోదావరికి వరదలు వచ్చి రహదారులు మునిగిపోతే తమ పరిస్థితి భయానకంగా మారుతుందని వాపోయారు.

స్పందించిన ఎంపీ కోటగిరి శ్రీధర్‌ మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, మీకు అండగా ప్రభుత్వం ఉంటుందని అన్నారు. వరదలు వస్తే నిర్వాసితులకు కల్పించాల్సిన రక్షణ చర్యలపై జల వనరుల శాఖాధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ పోలవరం పునరావాసంపై ప్రత్యేకాధికారిని నియమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.