Loading...

Explore Projects Across the Rajahmundry

హరినారాయణ.. శ్రీసత్యనారాయణ

హరినారాయణ.. శ్రీసత్యనారాయణ
వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్నవరంలో పోటెత్తిన భక్తులు
శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మి రూపంలో దర్శనం
న్యూస్‌టుడే – అన్నవరం

శేషపాన్పుపై పవళించే శ్రీమహావిష్ణువుగా సత్యదేవుడు, శ్రీమహాలక్ష్మిగా అనంతలక్ష్మీ అమ్మవారు అలంకరణలో వైకుంఠ ఏకాదశి పర్వదినం వేళ.. ఉత్తర ద్వారాన స్వామి, అమ్మవార్లను దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. అర్చకుల మంత్రోచ్ఛారణ.. ఆకట్టుకునే పుష్పాలంకరణ.. విద్యుత్తుకాంతుల మధ్య సుందరరూపంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు పులకించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సత్యదేవుని దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. ప్రధానాలయం వద్ద(బయటకు వచ్చే మార్గంలో) ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5 గంటల నుంచి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

అప్పటికే ప్రత్యేక వరుసల్లో బారులు తీరిన భక్తులు ‘హరినారాయణ.. శ్రీసత్యనారాయణ’ అంటూ స్వామిని తనివితీరా దర్శించుకున్నారు. ఈసారి సాయంత్రం 5 గంటల వరకు ఉత్తర ద్వార దర్శన అవకాశం కల్పించడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో సాయంత్రం వరకు రద్దీ నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా ఈవో నాగేశ్వరరావు, ఛైర్మన్‌ ఐ.వి.రోహిత్‌, సహాయ కమిషనర్‌ ఈరంకి జగన్నాథరావు, సూపరింటెండెంట్లు రమణ, కొండలరావు, లక్ష్మీనారాయణ తదితరులు ఎప్పటికప్పుడు పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.

ముఖ్యంగా ఈసారి పలు ప్రత్యేక ఏర్పాట్లు, కార్యక్రమాలతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఆలయాన్ని అంతటినీ వివిధ రకాల పుష్పాలతో అలంకరించడంతో కళకళలాడింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లను వెండిరథంపై ప్రధానాలయం చుట్టూ వూరేగించారు. పప్పు, ఆకుకూరలు, కాయగూరలు, మిరియాలు, బెల్లం, బియ్యంతో తయారుచేసిన ప్రత్యేక ప్రసాదాన్ని భక్తులకు అందించారు. కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *