Loading...

Explore Projects Across the Rajahmundry

శరవేగంగా విమానాశ్రయం అభివృద్ధి: చినరాజప్ప

శరవేగంగా విమానాశ్రయం అభివృద్ధి: చినరాజప్ప

కోరుకొండ, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో మంగళవారం ఇండిగో నూతన సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

చినరాజప్పతో పాటు పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్‌, శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, మేయరు పంతం రజనీ శేషసాయి, కలెక్టరు కార్తికేయ మిశ్రా, సబ్‌కలెక్టరు సాయికాంత్‌వర్మ, అర్బన్‌ ఎస్పీ బి.రాజకుమారి, ఎయిర్‌పోర్టు డైరెక్టరు ఎం.రాజకిషోర్‌ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ ఇప్పటికే భూసేకరణ చేసి విమానాశ్రయాన్ని విస్తరించినట్లు తెలిపారు. బ్రిటీష్‌ కాలంనాటి ఈ విమానాశ్రయం దశల వారీగా ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మరికొన్ని సంస్థలు ముందుకు రానున్నాయని త్వరలో మరిన్ని విమాన సర్వీసులు పెరగనున్నాయని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటికే తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలు అభివృద్ధి చెందాయని, విశాఖపట్నం కూడా అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. ఎంపీ మురళీమోహన్‌ మాట్లాడుతూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ సర్వీసులు రావడంతో ప్రజలకు ఉపయోగపడతాయని, దిల్లీకి కూడా సర్వీసు వస్తే బాగుంటుందని అన్నారు. సర్వీసులు పెరిగితే సామాన్య ప్రజలకు విమానయానం అందుబాటులోకి వస్తుందన్నారు. గ్రామీణ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చియ్యచౌదరి మాట్లాడుతూ బోయింగ్‌ సర్వీసుల ఏర్పాటు అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. నగర శాసనసభ్యుడు ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ విమాన సర్వీసుల అనుసంధానం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

వ్యాపార, వాణిజ్య రంగాలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. మేయరు పంతం రజనీశేషసాయి మాట్లాడుతూ ఇండిగో సర్వీసులతో విమాన ప్రయాణం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. అనంతరం ఇండిగో విమాన సర్వీసులను ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తిలకించారు. సంస్థ ప్రతినిధులు సంజీవ్‌ రామదాస్‌, అబ్రహం, జయంత్‌, డిప్యూటీ మేయరు వాసిరెడ్డి రాంబాబు, మోది సత్తిబాబు, కాశీ నవీన్‌కుమార్‌, డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *