Loading...

Explore Projects Across the Rajahmundry

మన్యంలో పర్యాటకుల సందడి

మన్యంలో పర్యాటకుల సందడి

మోతుగూడెం, న్యూస్‌టుడే: మూడు రోజులుగా మోతుగూడెం పర్యటక ప్రాంతాలు సందర్శకులతో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు, విద్యా సంస్థలకు క్రిస్మస్‌ సెలవులు రావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు తరలి వచ్చారు. జెన్‌కో అతిథి గృహాలు ఖాళీ లేకపోవడంతో మారేడుమిల్లి, భద్రాచలం, సీలేరులో వసతి ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి చాలా మంది వచ్చారు. పొల్లూరు జలపాతం, పోర్‌బే, డొంకరాయి, సీలేరు జలాశయాలు, జల విద్యుత్కేంద్రాల వద్ద ఉన్న ప్రకృతి రమణీయ దృశ్యాల అందాల నడుమ ఫొటోలు దిగుతూ సందడి చేశారు. మంచు సోయగాల నడుమ మోతుగూడెం అందాలను అస్వాదించారు. సీలేరు, పొల్లూరు జలపాతంలో స్నానాలు చేస్తూ సందడి చేశారు.  పొల్లూరు జలపాతం పరిసరాలు వాహనాల పార్కింగ్‌తో నిండిపోవడంతో కొన్ని వాహనాలను మోతుగూడెం జెన్‌కో రహదారి పొడవునా నిలిపారు.

మంచు కొండలా మన్యం
వరరామచంద్రాపురం: సోమవారం ఉదయం మన్యం మంచు కొండలా మారిపోయింది. పది గంటలు దాటినా.. మంచు తెరలు తొలగలేదు. ఈ నేపథ్యంలో రహదారులపై వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్రిస్మస్‌ సెలవు కావడంతో పాపికొండలు పర్యాటకానికి వేలసంఖ్యలో తరలి వచ్చారు. మంచు కారణంగా వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం పూటా లైట్లు వేసుకుని వాహనాలు నడిపారు. పోచవరం లాంచీల రేవులోనూ మంచుతెరల కారణంగా లాంచీలను కాస్త ఆలస్యంగా నడిపారు.

సందడిగా పాపికొండలు
దేవీపట్నం: పాపికొండలు విహారయాత్రకు సోమవారం పర్యాటకులు పోటెత్తారు. దేవీపట్నం మండలంలోని అంగుళూరు నుంచి 23 బోట్లు, 2 లాంచీలపై 2,600 మంది పాపికొండలు విహారయాత్రకు వెళ్లారని జూనియర్‌ అసిస్టెంట్‌ బి.రత్నరాజు తెలిపారు. వీరులో సుమారు రెండు వేల మంది పర్యాటకులు గండిపోశమ్మ అమ్మవారిని దర్శించుకున్నటుల ఆలయ జూనియర్‌ అధికారి కె.కొండబాబు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *