Loading...

Explore Projects Across the Rajahmundry

భలే ప్ర‘యోగం’!

భలే ప్ర‘యోగం’!
కాకినాడలో ప్లాస్టిక్‌ రహదారులు
తొలిసారిగా 10 రోడ్లు ఎంపిక

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: కాకినాడ నగరంలో ప్లాస్టిక్‌ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బహుళ ప్రయోజనాలు కలిగిన ఈ ప్లాస్టిక్‌ రోడ్లను ఇప్పటి వరకూ విజయవాడ, విశాఖపట్నం నగరాలలో మాత్రమే నిర్మించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో తొలిసారిగా కాకినాడ నగరంలో ఈ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ప్రయోగాత్మకంగా 10 రహదారులను ఎంపిక చేసి నిర్మిస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను కలిపిన తారు మిశ్రమంతో రోడ్లను నిర్మిస్తారు. ఇలా అభివృద్ధి చేసిన రహదారులు బలంగా ఉంటాయని ఇంజినీరింగు నిపుణులు చెబుతున్నారు. నీరు నిలవకుండా ఉన్న తారు రోడ్లు ఐదేళ్ల వరకూ మన్నుతాయి.

అదే ప్లాస్టిక్‌ మిశ్రమాన్ని కలిపి నిర్మించే రోడ్లు మరో మూడేళ్లు అదనంగా మన్నుతాయని నగరపాలక సంస్థ ఎస్‌ఈ విజయ్‌కుమార్‌ చెప్తున్నారు. ప్రస్తుతం నగరంలో డీసీసీ కార్యాలయం రోడ్డు, జగన్నాథపురంలోని భావన్నారాయణ జంక్షన్‌, హౌస్‌ ఆఫ్‌ ప్రేయర్‌ రోడ్లను ప్లాస్టిక్‌ మిశ్రమంతో నిర్మించారు. భవిష్యత్తులో అన్ని రోడ్లను ఇదే విధానంలో నిర్మించేందుకు సన్నహాలు చేస్తున్నారు. నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి, కలెక్టరు అరుణ్‌కుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌.అలీంబాషా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.

నిధులు ఆదా…
తారులో ప్లాస్టిక్‌ వ్యర్థాలను కలిపి రోడ్లను నిర్మించటం వల్ల నగరపాలక సంస్థకు పెద్దఎత్తున నిధులు ఆదా అవుతాయి. రోడ్డు నిర్మాణంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను వినియోగించటం వల్ల తారు వినియోగం తగ్గుతుంది. తద్వారా నిధులు ఆదా అవుతాయని ఇంజినీరింగు అధికారులు చెబుతున్నారు. నగరంలో 474 కి.మీ. రోడ్లు ఉన్నాయి. రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు ఏటా రూ. 15 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారు.

ప్రస్తుతం నగరంలో ప్లాస్టిక్‌ రోడ్లను ప్రవేశపెట్టటంతో ఈ ఖర్చు తగ్గనుంది. ప్రస్తుతం తారు పీపా మార్కెట్‌లో రూ. 32 నుంచి రూ. 35వేల వరకూ పలుకుతోంది. ఈ తారులో ప్లాస్టిక్‌కు కలపటం ద్వారా తారు వినియోగం తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. రోడ్డు జీవితకాలం కూడా పెరుగుతుంది.

పర్యావరణానికి మేలు
రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ వినియోగించటం వల్ల పర్యావరణానికి మేలు చేకూరనుంది. ఎందుకంటే సమాజంలో పెద్దఎత్తున వినియోగంలో ఉన్న ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. ప్లాస్టిక్‌కు త్వరగా మట్టిలో కలిసే గుణం లేదు. ఏళ్ల కొద్దీ అది భూమిలో అలాగే ఉండి పర్యావరణానికి హాని కలిగిస్తుంది. దాంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా నగరాల్లో 50 మైక్రాన్ల కంటే మందం తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధించారు. అయినప్పటికీ నీటిసీసాలు, గ్లాసులు, పాలిథిన్‌ సంచులు వంటి ప్లాస్టిక్‌ వస్తువులు వినియోగంలోనే ఉన్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *