Loading...

Explore Projects Across the Rajahmundry

భక్తులతో కిటకిటలాడిన శనీశ్వరాలయం

భక్తులతో కిటకిటలాడిన శనీశ్వరాలయం

మందపల్లి(కొత్తపేట), న్యూస్‌టుడే: మందపల్లి మందేశ్వర(శనీశ్వర)ఆలయం శనివారం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. అమావాస్య ముందు శ్రావణ మాసంలో వచ్చే శనిత్రయోదశి కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 25 వేల మంది భక్తులు వచ్చినట్లు ఆలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు చేరుకుని దర్శనం కోసం బారులు తీరారు. అలాగే తైలాభిషేకాలు చేయించుకునే భక్తులతో ఆలయ ప్రాంగణం, వెనుక ఏర్పాటు చేసిన షెడ్డులు కిక్కిరిసిపోయాయి. స్వామివారిని ప్రముఖ సినీ గాయకుడు నాగూర్‌బాబు(మనో) కుటుంబ సభ్యులతో వచ్చి దర్శించుకున్నారు. తైలాభిషేకం చేశారు. మహారాష్ట్రకు చెందిన జీ.వై పాటిల విశ్వవిద్యాలయం పాలకమండలి ఛైర్మన్‌ పి.డి.పాటిల్‌, భాగ్యశ్రీ దంపతులు స్వామివారి ముఖద్వారం వద్ద శివపార్వతుల విగ్రహాలు ఏర్పాటు చేసేందకు రూ.1,16,000 లక్షలు విరాళంగా అందించారు.

అలాగే మరో భక్తుడు తోట వీరబాబు స్వామి వారి ఆలయానికి రూ.40 వేల విలువైన ఏసీని బహూకరించారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బండారు సూర్యనారాయణమూర్తి, కార్యనిర్వహణాధికారి వి.వి.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి, ధర్మకర్తలు శీలం శ్రీనివాసరావు, పినిశెట్టి దేవి, బండారు సత్తిబాబు, చోడపనీడి బాబు, గంధం వీరవెంకట చంద్రమౌళీశ్వరరావు, మూర్కొండ వీరబాబు, నల్లా శ్రీరామ్‌ప్రసాద్‌ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రావులపాలెం సి.ఐ బి.పెద్దిరాజు ఆధ్వర్యంలో ఎస్‌.ఐ డి.విజయకుమార్‌ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.

రూ.17.71 లక్షల ఆదాయం
ఆలయానికి భక్తుల ద్వారా రూ. 17,71,202 ఆదాయం సమకూరినట్లు ఈవో మూర్తి తెలిపారు. టిక్కెట్ల ద్వారా రూ.15,63,900, వ్యక్తిగత రసీదులు ద్వారా రూ.43,000, గేట్‌వే పేమెంట్‌ ద్వారా రూ.1,57,300, తంతితపాల ద్వారా రూ.7,002 సమకూరాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *