Loading...

Explore Projects Across the Rajahmundry

పసుపు కుంకుమగా జిల్లాకు రూ.360 కోట్లు

పసుపు కుంకుమగా జిల్లాకు రూ.360 కోట్లు

పోతునూరు(దెందులూరు), న్యూస్‌టుడే:పసుపు కుంకుమ కార్యక్రమం కింద జిల్లాలోని డ్వాక్రా మహిళలకు రూ.360 కోట్లు వచ్చాయని కలెక్టరు కాటంనేని భాస్కర్‌ అన్నారు. దెందులూరు మండలం పోతునూరులోని స్వరాజ్‌భవన్‌లో పసుపు కుంకుమ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టరు మాట్లాడుతూ రుణమాఫీలో భాగంగా రెండు విడతలుగా వచ్చిన మొత్తాన్ని మహిళల వ్యక్తిగత ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. సంక్రాంతి పండుగలోపు వీటిని మహిళలకు అందించాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీచేశామన్నారు. గృహనిర్మాణంలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.

దెందులూరు నియోజకవర్గంలో గృహనిర్మాణం తీరు బాగుందన్నారు. మార్చి నెలాఖరు నాటికి కేటాయించిన గృహాల నిర్మాణం పూర్తి చేస్తే అదనంగా 500 గృహాలు మంజూరు చేస్తామన్నారు. 2018-19 నాటికి ప్రతీ పేదవానికి సొంతిల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.లక్షన్నరతో పాటు లబ్ధిదారులు మరో రూ.లక్ష ఏర్పాటు చేసుకుంటే సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ప్రభుత్వవిప్‌ చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలోని మహిళలకు సంక్రాంతి లోగా రుణమాఫీ నగదు అందించడానికి కృషిచేస్తామన్నారు.

బ్యాంకర్లు వాయిదాలు, అప్పుల పేరుతో ఈ మొత్తాలను జమచేసుకోవడానికి చూస్తున్నారని ఇటువంటి చర్యలు లేకుండా చూడాలని కలెక్టరును కోరారు. పట్టిసీమ ఎత్తిపోతలు ద్వారా వచ్చిన నీటిని నియోజకవర్గంలోని రైతులకు అందించడానికి కలెక్టరు అందించిన సహకారం మరువలేనిదన్నారు. మహిళలకు రుణమాఫీ నగదు, జాకెట్‌, పసుపు, కుంకుమలను అందించారు. కార్యక్రమంలో సర్పంచి జక్కుల దాసు, ఎంపీపీ పప్పల సుశీల, జడ్పీటీసీ సభ్యురాలు ముమ్మడి సక్కుకుమారి, ఏఎంసీ ఛైర్మన్‌ మాగంటి సురేంద్రనాధ్‌ చౌదరి, సహకార సంఘ అధ్యక్షుడు డీఎన్‌వీ ప్రసాద్‌, ఆర్డీవో తేజ్‌భరత్‌, ఎంపీటీసీ సభ్యులు తలారి ధన్యకుమార్‌, బట్రాజు లక్ష్మీపార్వతి, బ్యాంకు మేనేజరు వెంకటేశ్వరరావు, ఎంపీడీవో వేణుగోపాల్‌, తహశీల్దారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *