Loading...

Explore Projects Across the Rajahmundry

Tourism festivals dates

పర్యాటక పండుగలకు తేదీల ఖరారు

పర్యాటక పండుగలకు తేదీల ఖరారు
ఈ నెల 12 నుంచి కాకినాడలో సాగర సంబరాలు
ఫిబ్రవరి 23 నుంచి కోనసీమ ఉత్సవాలు
మార్చి 26 నుంచి మన్యం జాతర

జిల్లా సచివాలయం(కాకినాడ), న్యూస్‌టుడే: కొత్త సంవత్సరంలో సంబరాల సందడి మొదలైంది. సంక్రాంతిని పురస్కరించుకుని జిల్లాలో పర్యాటక పండుగల తేదీలను ఖరారు చేశారు. కాకినాడ కలెక్టరేట్‌ విధాన గౌతమి సమావేశ మందిరంలో కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధిని మరింత వేగిరం చేయటానికి కాకినాడ సాగర సంబరాలు, కోనసీమ ఉత్సవాలు, మన్యం జాతర తేదీలను ఖారారు చేశారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ఈ పండుగల తేదీలను ప్రకటించారు. కాకినాడ ఎన్టీఆర్‌ బీచ్‌లో ఈ నెల 12 నుంచి 15 వరకూ సంక్రాంతిని పురస్కరించుకుని సాగర సంబరాలు, ఫిబ్రవరి 23 నుంచి 26 వరకూ మహాశివరాత్రిని పురస్కరించుకుని కోనసీమ ఉత్సవాలు, మార్చి 26 నుంచి 28 వరకూ ఉగాదిని పురస్కరించుకుని ఏజెన్సీ ప్రాంతంలో మన్యం జాతర నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఇతర రాష్ట్రాలు, జిల్లాలోని పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో వీటిని నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నెల 12 నుంచి 15 వరకూ నిర్వహించే కాకినాడ సాగర సంబరాలపై సమీక్షిస్తూ ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాకినాడ బీచ్‌లో ఈత, పడవ పోటీలను కూడా నిర్వహించాలన్నారు. సాగర సంబరాల్లో పనిచేసిన సిబ్బందికి తరువాత సెలవులు మంజూరు చేయాలని రాజప్ప సూచించారు. కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ సాగర సంబరాల్లో ఆక్వా రంగం, పండ్ల తోటల విభాగాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.

వాటర్‌ స్పోర్ట్సును ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాకు చెందిన యువ కళాకారులో సాంస్కృతిక ప్రద్శనలు నిర్వహిస్తామన్నారు. ఆలయ నమూనాలు, కూచిపూడి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో కోరంగి అభయారణ్యాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలుపుతామన్నారు. కోరంగి నుంచి హోప్‌ఐలాండ్‌కు ప్రత్యేక బోటు ఏర్పాటు చేసి, ప్రతీరోజు పర్యాటకులు పయనించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. సాగర సంబరాల్లో మెగా ఫుడ్‌ఫెస్టివల్‌ నిర్వహిస్తామన్నారు.

ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ, జగన్నాథపురం వంతెన వద్ద ఈత, పడవ పోటీలు నిర్వహించాలని కోరారు. అనంతరం సాగర సంబరాల గోడపత్రిక విడుదల చేశారు. సమావేశంలో ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, దాట్ల బుచ్చిబాబు, సంయుక్త కలెక్టర్‌ సత్యనారాయణ, అదనపు ఎస్పీ దామోదర్‌, అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రాంతీయ సంచాలకులు భీమశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు పండుగలు వద్దా..?
జిల్లాలో పర్యాటక పండుగలు నిర్వహణపై కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త, తెదేపా నేత పిల్లి సత్తిబాబు మాట్లాడుతూ కాకినాడ ఎన్టీఆర్‌ బీచ్‌లో నిర్వహించే సాగర సంబరాల తేదీలు సంక్రాంతికి ముందే నిర్వహించాలని కోరారు. పండుగల్లో ఉద్యోగులు, అధికారులు వారి సొంత గ్రామాలకు వెళ్లి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *