Loading...

Explore Projects Across the Rajahmundry

పట్టణాల్లో సాంకేతిక సర్వే

పట్టణాల్లో సాంకేతిక సర్వే

అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ల వినియోగం

‌అనుమతుల కోసం జిల్లా ఎస్పీకి లేఖలు రాసిన నగర, పురపాలక కమిషనర్లు

న్యూస్‌టుడే, తుని

జిల్లాలోని నగర, పురపాలికలు, నగర పంచాయతీల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది..కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు అమలాపురం, మండపేట,
రామచంద్రపురం, పెద్దాపురం,  సామర్లకోట, పిఠాపురం, తుని  పురపాలక సంఘాలు,  గొల్లప్రోలు, ఏలేశ్వరం, ముమ్మిడివరం నగర  పంచాయతీల్లో డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రణాళికను సిద్ధం చేయగా తాజాగా జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశాలతో జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని అనుమతుల కోసం నగర, పురపాలక సంఘాల కమిషనర్లు లేఖలు రాశారు. విమానయాన శాఖ నిబంధనలకు లోబడి తమ ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించేందుకు అనుమతించాలని వారు లేఖల్లో కోరారు. దీనికి అనుగుణంగా పోలీసు శాఖ నుంచి స్పష్టమైన అనుమతులు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ విధానం మన జిల్లాలోను త్వరలో ప్రారంభం కానుంది. నగర, పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో ఉన్న భవనాలు, వాటి నిర్మాణాలు, ఖాళీ స్థలాలు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలు తదితర వాటిని డ్రోన్ల ద్వారా పరిశీలించనున్నారు.

పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌, పారిశుద్ధ్యం, రెవెన్యూ, గృహ నిర్మాణ విభాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ఆయా విభాగాల్లో అవినీతి, అక్రమాలు జరగకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉన్నతాధికారులు నిఘా పెట్టే అవకాశం ఏర్పడుతుంది. ఈ డ్రోన్లను వినియోగించి 3డీ చిత్రాలను తీసి ఆన్‌లైన్‌ మ్యాపింగ్‌ ద్వారా మంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలోనూ స్థానిక పరిస్థితులను తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విధానంపై అవగాహన కలిగించేందుకు అయిదారు నెలల కిందట జిల్లా వ్యాప్తంగా 25 మంది ప్రజారోగ్య సిబ్బందికి అమరావతిలో శిక్షణ సైతం ఇచ్చారు. వీరు ఆయా పట్టణాల్లో డ్రోన్ల వినియోగాన్ని  పరిశీలిస్తారు. ఎంత ఎత్తువరకు వీటిని ఎగిరేందుకు అనుమతులిస్తారనేది తేలాల్సి ఉండగా, జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేటు సంస్థలు, వ్యాపారులు సైతం డ్రోన్లను వినియోగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *