Loading...

Explore Projects Across the Rajahmundry

గ్రామీణాభివృద్ధి ఆర్థిక చేకూర్పులో పశ్చిమ ఆదర్శం

గ్రామీణాభివృద్ధి ఆర్థిక చేకూర్పులో పశ్చిమ ఆదర్శం

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే:గ్రామీణాభివృద్ధి ఆర్థిక చేకూర్పులో పశ్చిమగోదావరి జిల్లా ఆదర్శంగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ఆర్ధికవృద్ధి చేకూర్పు ప్రాజెక్టు ప్రతినిధుల బృందం కితాబునిచ్చింది. రెండు రోజులుగా జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్‌ బృంద సభ్యులు కలెక్టర్‌ భాస్కర్‌ను బుధవారం రాత్రి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు మిషన్‌ ఓటర్‌ శానిటేషన్‌ స్పెషలిస్ట్‌ సీతారామచంద్ర మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణప్రాంత నివాసితులు ఎంతో ఆదర్శవంతులని కొనియాడారు. గత ఏడాది నుంచి జిల్లాలో గ్రామీణ ఆర్థిక చేకూర్పు వృద్ధి ప్రాజెక్టును అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రగతి తీరు పరిశీనలకోసం రెండు రోజులపాటు పలు గ్రామాల్లో పర్యటించామని చెప్పారు.

జిల్లాలో వెనుకబడిన మండలాలైన ద్వారకాతిరుమల, చింతలపూడి, గోపాలపురం, తాళ్లపూడి, పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పెనుగొండలో గ్రామీణ ప్రజల జీవనోపాధికి ప్రాజెక్టు పరిధిలో తగు చర్యలు తీసుకున్నామన్నారు. దేశవ్యాప్తంగా రూ. 650 కోట్లతో 100 మండలాల్లో గ్రామీణ ప్రాంత పేదల జీవనోపాధికి పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో మహిళల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. కలెక్టర్‌ కె.భాస్కర్‌ మాట్లాడుతూ జిల్లాలో బహిరంగ మలవిసర్జనను నూరుశాతం నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. డ్వాక్రా సంఘాల మహిళ జీవనోపాధికి ధాన్యం కొనుగోళ్ల వ్యాపారంతోపాటు జనరిక్‌ మందుల దుకాణాల నిర్వహణ తదితర ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బృంద ప్రతినిధులు బాలక్రిష్ణన్‌మాధవన్‌, దీపికాచౌదరి, ప్రదీప్‌వలసాంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

నూరుశాతం నగదురహిత లావాదేవీల అమలుకు కృషిచేయాలి
ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే:జిల్లాలో నూరుశాతం నగదురహిత లావాదేవీల అమలుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్‌ కె.భాస్కర్‌ చెప్పారు. జిల్లాలో నగదు రహిత లావాదేవీల అమలుపై అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ ఈనెల 5వ తేదీన నాలుగు ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత విధానంలో టికెట్లను ప్రయాణికులు కొనుగోలు చేసుకునే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచార బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు.

వేలిముద్రల ఆధారంగా నగదు రహిత లావాదేవీలను అమలు చేయడానికి అన్ని బ్యాంకుల్లో ఖాతాలను ఆధార్‌ అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి కావస్తోందని తెలిపారు. జిల్లాలో 1033 మందుల దుకాణాలు, 382 ప్రైవేటు ఆసుపత్రుల్లో, 64 డయాగ్నొస్టిక్‌ కేంద్రాల్లో నగదురహిత లావాదేవీల నిర్వహణకు బ్యాంకు ఖాతాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోటేశ్వరిని కలెక్టర్‌ ఆదేశించారు. పనితీరు మెరుగుపరుచుకోకపోతే జిల్లాకు కొత్త డీఎంహెచ్‌వో వచ్చే అవకాశాలుంటాయని హెచ్చరించారు. జిల్లాలో 19,912 రవాణా వాహనాలున్నాయని, వాటి యజమానులంతా బ్యాంకు ఖాతాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఉప రవాణా కమిషనరు సత్యనారాయణమూర్తిని కలెక్టర్‌ ఆదేశించారు. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *