Loading...

Explore Projects Across the Rajahmundry

గ్రామాల్లో స్వచ్ఛసర్వేక్షణ్‌ పారిశుద్ధ్య సర్వే

‘స్వచ్ఛ’మేవ జయతే..!

ఆగస్టు ఒకటి నుంచి కేంద్ర బృందాల పర్యటన

గ్రామాల్లో స్వచ్ఛసర్వేక్షణ్‌ పారిశుద్ధ్య సర్వే

909 :జిల్లాలో మొత్తం పంచాయతీలు

600:పంచాయతీ కార్యదర్శుల సంఖ్య
90:ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు

3,176 : మొత్తం ప్రభుత్వ పాఠశాలలు
యలమంచిలి, న్యూస్‌టుడే:

జిల్లాను రాష్ట్రంలోనే బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించి ఏడాది పూర్తయ్యింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలాగుందో ఉన్నతాధికారుల నుంచి పారిశుద్ధ్య కార్మికుల వరకు అందరికీ తెలిసిందే. కాగితపు పులులుగా చెలామణి అవుతున్న గ్రామాల నిగ్గు కేంద్ర బృందాల రాకతో తేటతెల్లం కానుంది. స్వచ్ఛసర్వేక్షణ్‌ గ్రామీణ్‌ సర్వే -2018 ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభం కానుంది. నెలరోజులపాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఈ సర్వేలో ఆయా గ్రామాల్లోని పారిశుద్ధ్య స్థితిగతులను బట్టి ర్యాంకులు ఇవ్వనున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ర్యాంకులు ప్రకటించి అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా పురస్కారాలను అందించనున్నారు. కేంద్ర బృందాల రాకను పురస్కరించుకుని గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి అధికారులు సమాయత్తమయ్యారు. దీనిపై ‘న్యూస్‌టుడే’ పరిశీలనాత్మక కథనం.

తాగునీరు, పారిశుద్ధ్య కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సర్వేలో వంద మార్కులుంటాయి. పారిశుద్ధ్య స్థితికి 5,  జియోట్యాగింగ్‌కు 5, బహిరంగ మలవిసర్జన రహిత పరిస్థితి 5, పనిచేయని మరుగుదొడ్లను అందుబాటులోకి తేవడానికి 10, స్వచ్ఛభారత్‌ మిషన్‌ పరిధిలో ప్రగతికి 35, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాల ధ్రువీకరణ 10, మరుగుదొడ్ల లభ్యత 5, మరుగుదొడ్ల వాడకం, శుభ్రతకు 5, గ్రామస్థాయిలో చెత్త పోగవుతున్న స్థితికి 10, ప్రభుత్వ సంస్థల పరిసరాల్లో నిల్వనీటి స్థితిగతులకు 10 చొప్పున మార్కులు కేటాయించారు. గ్రామాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మార్కులు ఇస్తారు.

వీటిపైనే ప్రధాన దృష్టి
గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్‌వాడీలు, సంతబజార్లు, మతపరమైన ప్రాంతాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బృందాలు ప్రధానంగా పరిశీలిస్తాయి. పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిస్థితి, తాగునీరు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పరిసరాల శుభ్రతపై దృష్టి సారించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ఇదే కొనసాగుతుంది. సంతబజార్లలో చెత్తను తొలగించే విధానం, ఇతర ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో రోగుల కోసం కల్పిస్తున్న వసతులను పరిశీలిస్తారు. వీటికి సంబంధించిన చిత్రాలను తీసుకుంటారు.

జిల్లాకు ర్యాంకు ఇలా..
దేశంలోనే అతిపెద్ద సర్వేగా చెబుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో స్వతంత్ర సర్వే ఏజెన్సీ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే నిర్వహించి ర్యాంకులు ప్రకటిస్తారు. అగ్రశ్రేణిలో నిలిచిన రాష్ట్రాలకు, జిల్లాలకు పురస్కారాలు ఇస్తారు. ఇందులో పారిశుద్ధ్య సంబంధిత ప్రమాణాలతో అమలు స్థాయిలో జిల్లా ప్రగతికి 35, బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ సంస్థల పారిశుద్ధ్యాన్ని ప్రత్యక్ష పరిశీలన ద్వారా అంచనా వేసేందుకు 30, గ్రామీణ స్థాయిలో ప్రజలు, అనుభవజ్ఞుల అభిప్రాయాలు సేకరించడం ద్వారా మరో 35 చొప్పున మార్కులు కేటాయించారు. వీటిలో జిల్లా సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకు రానుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *