కలెక్టరేట్ వద్ద ఆశ వర్కర్ల ధర్నా
కలెక్టరేట్ వద్ద ఆశ వర్కర్ల ధర్నా
పెంచిన పారితోషికాలు చెల్లించాలని డిమాండ్
ప్రభుత్వం పెంచిన పారితోషికాలను వెంటనే చెల్లించాలని ఆశ వర్కర్లు నినదించారు.
\సీఐటీయూ ఆధ్వర్యంలో వందల మంది వర్కర్లు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ నాలుగు నెలల కిందట జీతాలు పెంచుతూ సన్మానాలు చేయించుకున్న ముఖ్యమంత్రి పెంచిన మొత్తాలను చెల్లించకపోవడం బాధాకరమన్నారు.
జూన్ 27న ప్రజాదర్బార్లో ఆశ వర్కర్లకు పరిమితులులేని విధంగా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
పారితోషికాల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం సీలింగ్ విధించడంతో కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాలు ఆశ వర్కర్లకు లభించడం లేదన్నారు.
ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.పోశమ్మ, ఎ.శ్యామలారాణి మాట్లాడుతూ జీతాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల వేధింపులు పెరిగాయన్నారు.
జీతాల పెంపు పేర పనిభారం పెంచారన్నారు. ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పించాలని, అధికారులు, రాజకీయ నాయకుల వేధింపులను ఆపాలని డిమాండు చేశారు.
సీపీఎం జిల్లానాయకుడు జి.నరసింహారావు ఆందోళనకు మద్దతు తెలియజేశారు.
డీఎంహెచ్వో సుబ్రహ్మణ్యేశ్వరి ధర్నా శిబిరానికి చేరుకొని ఆశ వర్కర్లను ఉద్దేశించి మాట్లాడారు.
సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ధర్నాలో సీఐటీయూ నాయకులు ఎం.శ్రీనివాస్, పి.కిషోర్, పి.రవికుమార్, ఎ.అజయకుమారి తదితరులు పాల్గొన్నారు.