Loading...

Explore Projects Across the Rajahmundry

ఓటు హక్కుపై ప్రచారం


ఓటు హక్కుపై ప్రచారం

కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే:

జిల్లా వ్యాప్తంగా ఓటు హక్కుపై విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్‌ కోర్టు హాలులో అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు.

నియోజకవర్గాల్లోని జనాభాతో పోల్చితే ఓటర్ల నిష్పత్తి కొన్ని చోట్ల తక్కువగా ఉందని, మరికొన్నింటిలో ఎక్కువగా ఉందని, దీన్ని పూర్తిస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

జిల్లాలో ప్రస్తుతం 54.91 లక్షల జనాభా ఉంటే 38.40 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లాలో ప్రతి 1000 మంది జనాభాకు సరాసరి ఓటర్లు 699 మంది ఉన్నారన్నారు.

కొన్ని చోట్ల 441 మంది, మరికొన్నింటిలో 984 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ప్రతి వెయ్యి మంది జనాభాకు 740 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న చోట ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ప్రతి వెయ్యి మందిలో 670 మంది కంటే తక్కువ ఓటర్లు ఉన్నచోట పరిశీలించాలని ఆదేశించారు.

వచ్చే నెల 31వ తేదీ వరకు ఓటు నమోదు, అభ్యంతరాల స్వీకరణకు గడువుందని, ఈ లోపు అర్హత ఉన్నవారంతా ఓటర్లుగా చేరడానికి కృషి చేయాలన్నారు.

2019, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారికి ఓటు హక్కు కల్పించాలని సూచించారు.

ప్రజావాణి అర్జీలపై సమీక్ష..
ప్రతి సోమవారం ప్రజావాణికి ప్రజల నుంచి వస్తున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

బుర్రిలంకలో నాటుసారా తయారీపై వచ్చిన ఫిర్యాదుపై తక్షణం చర్యలు చేపట్టాలన్నారు.

ప్రతి అర్జీకి తక్షణ పరిష్కారం చూపాలని, ఏడు నుంచి 10 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో మంజూరైన కాపు, బీసీ భవనాల నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. స్థలాలు త్వరగా సమకూర్చాలని ఆర్డీవోలను ఆదేశించారు.

సామర్లకోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు మరుగుదొడ్లు నిర్మించాలని ఆదేశించారు.

ఎన్టీఆర్‌ బీచ్‌ వద్ద ఫిష్‌ డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫాం
సూర్యారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఎన్టీఆర్‌ బీచ్‌ వద్ద మత్య్సకారులకు ఫిష్‌ డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫాం నిర్మించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

గురువారం కలెక్టరేట్‌లో ఆయన పర్యాటకశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

జాతీయ ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో దీని నిర్మిస్తామన్నారు.

స్థానిక మత్య్సకారులతో ఆ శాఖ అధికారులు సంప్రదించి, నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు.

ఎన్టీఆర్‌ బీచ్‌ను సందర్శించడానికి వచ్చే ప్రజలకు పార్కింగ్‌ స్థలాన్ని కేటాయించాలని, బారీకేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *