Loading...

Explore Projects Across the Rajahmundry

ఒలింపిక్‌ క్రీడలే లక్ష్యంగా గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం

ఒలింపిక్‌ క్రీడలే లక్ష్యంగా గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం

అమలాపురం, న్యూస్‌టుడే: గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి తద్వారా 2020, 2024 ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనే స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో నేషనల్‌ యువ కో ఆపరేషన్‌  సొసైటీ పనిచేస్తుందని ఆ సంస్థ ఉభయ గోదావరి జిల్లాల సమన్వయకర్త రామకృష్ణ, ప్రతినిధులు ప్రొఫెసర్‌ డాక్టర్‌ చిట్టూరి గణేష్‌, జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ సభ్యుడు చిట్టూరి చంద్రశేఖర్‌ తెలిపారు. అమలాపురంలో మంగళవారం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో విలేకరుల సమావేశం నిర్వహించి పలు అంశాలను వెల్లడించారు. ఎటువంటి క్రీడా సంఘాలు, సంస్థల ప్రమేయం లేకుండా నేరుగా ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు.

గెయిల్‌ ఇండియా సహకారంతో ‘ఇండియన్‌ స్పీడ్‌ స్టార్‌’ పేరుతో నిర్వహిస్తున్న ఈకార్యక్రమం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లోని అండర్‌-14, అండర్‌-17 విభాగాల్లోని అథ్లెటెక్స్‌ పోటీలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 28న విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలోని స్పోర్ట్స్‌ స్టేడియంలో ఎంపికలుంటాయని వెల్లడించారు. ఇప్పటికే రెండు దశల్లో జరిగిన ఈ ఎంపికల్లో 24 మంది క్రీడాకారులు జమైకా వంటి దేశాల్లో హుస్సేన్‌బోర్డు అకాడమీ ద్వారా శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటికే బాక్సింగ్‌, రన్నింగ్‌ విభాగాల్లో శిక్షణ పొందుతున్న చీకురుమిల్లి హాసిని, నాగాబత్తుల లతిన్‌, చిట్టూరి యువశంకర్‌ తదితరులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సమావేశంలో వ్యాయామోపాధ్యాయుల సంఘం జోన్‌ అధ్యక్షుడు వీఎస్‌వీ ముసలయ్య, కార్యదర్శి రమేష్‌,  ఆర్‌.కాశీవిశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *