Loading...

Explore Projects Across the Rajahmundry

ఆకాశ మార్గాన సత్యగిరి వీక్షణ

ఆకాశ మార్గాన సత్యగిరి వీక్షణ

విశాఖ-అరకు-అన్నవరానికి హెలీ టూరిజం విస్తరణపై వుడా దృష్టి

ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు

న్యూస్‌టుడే, అన్నవరం

హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తూ ఆకాశమార్గాన అన్నవరం అందాలను వీక్షించే అవకాశాన్ని భక్తులు, పర్యాటకులకు కల్పించేందుకు వుడా (విశాఖ నగరాభివృద్ధి సంస్థ) ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ముందుగా విశాఖపట్నంలో హెలీ టూరిజాన్ని ప్రారంభించి అనంతరం అరకు, అక్కడి నుంచి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరానికి దీనిని విస్తరించాలని సంకల్పించింది. వుడా, మరో సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిసింది. దీనిపై హెలీ టూరిజం అధికారులు, వుడా ఉపాధ్యక్షుడు పట్నాల బసంత్‌కుమార్‌లు చర్చించారు. పర్యాటక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంను ఆకాశ మార్గాన పర్యాటకులు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా అరకు సందర్శనకు వెళ్తున్న పర్యాటకుల సంఖ్య కూడా భారీగా ఉండడంతో విశాఖపట్నం నుంచి అరకు, అక్కడి నుంచి అన్నవరం వరకు దీనిని పొడిగించాలని ప్రతిపాదించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు సత్యదేవుని దర్శనానికి అన్నవరానికి వస్తుంటారు. హైదరాబాద్‌, ఇతర రాష్ట్రాల నుంచి విమానంలో విశాఖ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గం ద్వారా భక్తులు అన్నవరం చేరుకుంటారు.

స్వామి దర్శనానికి రోజూ సుమారు 15 వేల నుంచి 20 వేల మంది వస్తుండగా వీరిలో 20 శాతం మంది ఇలానే వస్తున్నారని అధికారులు అంచనా ఈ నేపథ్యంలో హెలీ టూరిజాన్ని అన్నవరం వరకు పొడిగించే ప్రతిపాదన చేశారు.హెలికాఫ్టర్‌లో ఆకాశ మార్గాన వీక్షించే అవకాశం ఉంటుందా… లేదా అన్నవరంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేసి విశాఖపట్నం నుంచి అన్నవరానికి భక్తులను తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తారా..? అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అన్నవరం దేవస్థానాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు గతంలో అనేక ప్రణాళికలు, ప్రతిపాదలు చేసినా కార్యరూపం దాల్చలేదు. రత్నగిరి, సత్యగిరి కొండలను అనుసంధానం చేస్తూ పంపా రిజర్వాయర్‌ మీదుగా రోప్‌వే ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించి ఏళ్లు గడిచినా ఇది ఆచరణకు నోచుకోలేదు. అన్నవరానికి 18 కిలోమీటర్ల పరిధిలోనే సముద్ర తీరం ఉంది. ఇక్కడి బీచ్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమహేంద్రవరంలో గోదావరి నదీ అందాలు, అక్కడి నుంచి పాపికొండలకు వెళ్లే ఏర్పాట్లు ఉన్నాయి. ఈ పరిస్థితిలో అన్నవరం దేవస్థానాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి నిలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *