Loading...

Explore Projects Across the Rajahmundry

new road ways, new highways

ఆంధ్రాలో ఆరు హైవేలు

ఆంధ్రాలో ఆరు హైవేలు

  • 14,435కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం
  • దుగరాజపట్నం..రేవుగా పనికిరాదు
  • అందుకే నిధులు సమకూర్చలేదు
  • రాజ్యసభలో ప్రశ్నలకు కేంద్రం జవాబు

ఆంధ్రాలో ఆరు హైవేలు:

ఆంధ్రప్రదేశ్‌లో రూ.14,435కోట్ల వ్యయంతో మొత్తం ఆరు జాతీయ రహదారి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర రవాణా, జాతీయరహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. సోమవారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు టీజీవెంకటేశ్‌ అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో మరో రూ.59కోట్ల వ్యయంతో 71 రహదారులను మరమ్మతులు చేపడుతున్నట్టు తెలిపారు. గత రెండేళ్లుగా ఈ పనులు జరుగుతున్నాయని, అవి నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, భారీ ఓడరేవు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన దుగరాజపట్నం.. అనువైన ప్రదేశంకాదని కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మాన్షుఖ్‌ మండావీయ స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ దీనిపై వేసిన ప్రశ్నకు మంత్రి ఈ సమాధానం ఇచ్చారు.

ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశామన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ నియమించింది. ఈ ఓడరేవు ప్రతిపాదనను కమిటీ పరిశీలించిన అనంతరం దుగరాజపట్నంలో ఓడరేవు అభివృద్ధికి పరిస్థితులు సానుకూలంగా లేవని నివేదించింది. ఈ కారణంతోనే ఓడరేవుకోసం నిధులు సమకూర్చలేదు’’ అని మంత్రి మండావీయా వివరించారు. కృష్ణా నదిపై విజయవాడ నుంచి ముక్త్యాల వరకు తలపెట్టిన జలరవాణా పనులు(పార్ట్‌ ఆఫ్‌ ఎన్‌డబ్ల్యూ-4) మొదలైనట్లు తెలిపారు. జలరవాణా ఆర్థికంగా, పర్యావరణపరంగా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాగా, దేశంలోని నదులను పరిశుభ్రపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని, తెలుగు రాష్ర్టాలలోని గోదావరి, మూసీ నదుల పరిశుభ్రత కోసం రూ.259.80కోట్లు విడుద ల చేశామని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా తెలిపారు. ఇందులో ఏపీ పరిధిలోని గోదావరి నదిని శుద్ధి చేయడానికి రూ.21.78కోట్లు, తెలంగాణలోని గోదావరి, మూసీ నదుల పరిశుభ్రత కోసం రూ.345.72కోట్లు వంతున మంజూరు చేసి, ఇప్పటివ దాకా ఈ రెండు రాష్ర్టాలకు కలిపి రూ.259.80కోట్లు విడుదల చేసినట్లు మంత్రి వివరించారు.